వైసీపీని కుదిపేస్తున్న రెండు హాట్ టాపిక్‌లు.. ఎందుకంటే…!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో నేత‌ల‌ను.. రెండు కీల‌క విష‌యాలు కుదిపేస్తున్నాయి. ఈ రెండు అంశాల‌పైనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఏ ఇద్ద‌రు నేత‌లు క‌లిసినా.. ఈ రెండు అంశాలే కేంద్రంగా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. ఇటీవ‌ల కాలంలో ఈ రెండు అంశాల‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ భారీ ఎత్తున ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లింది. దీంతో ఆయా అంశాలపై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు దారితీయ‌క ముందే.. టీడీపీ నేత‌లు చ‌ర్చిస్తుండడం గ‌మ‌నార్హం. ఇంత‌కీ.. అవేంటంటే..

ఔను! మ‌న‌ల్ని మ‌నం హైలెట్ చేసుకుంటే త‌ప్పేంటి? ఇదీ.. ఇప్పుడు వైసీపీ నేత‌ల మ‌ధ్య జరుగుతున్న చ‌ర్చ‌. దీనికి కార‌ణం.. తాజాగా అసెంబ్లీలో బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి.. బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెడుతూ.. జ‌గ‌న్ స‌ర్కారుకు అన్ని వ‌ర్గా ల‌మ‌ద్ద‌తు ఉంద‌ని.. రాష్ట్రంలో అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌ని, రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నామ‌ని వివ‌రించారు. అయితే.. దీనిపై టీడీపీ నుంచి తీవ్ర‌స్తాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మీకు మీరే పొగ‌డ్త‌లు చేసుకుంటారా? మీకు మీరే భుజాలు త‌డుము కుంటారా? అంటూ.. నాయ‌కులు ప్ర‌శ్నించారు.

అంతేకాదు… తెలంగాణ‌లో మాదిరిగా మీరు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. అంటూ.. టీడీపీ నాయ‌కులు దుయ్య‌బ‌ట్టారు. అయితే.. దీనిపై వైసీపీ నాయ‌కులు బ‌హిరంగంగా ఎలాంటి కామెంట్లు చేయ‌క‌పోయినా.. ఇలా పొగుడుకుంటే త‌ప్పేంటి? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇది కామ‌నేన‌ని అంద‌రూ చేసే ప‌నేన‌ని అంటున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు రోజుకు గంట‌ల త‌ర‌బ‌డి.. చెప్పుకోలేదా? అని ఎదురు నిల‌దీస్తున్నారు. అంతేకాదు.. ప్రజల్లో ఉన్న‌దే క‌దా.. చెబుతున్నారు. నిజానికి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని భావిస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎందుకు వైసీపీకి బ‌ల‌మైన మెజారిటీ ఇచ్చార‌ని కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌రోవైపు.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ చేస్తున్న ప్ర‌చారాన్ని కూడా వారు త‌ప్పుబ‌డుతున్నారు. ఎందుకంటే.. అస‌లు ముంద‌స్తుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో ముంద‌స్తు.. అనే మాట వినిపిస్తేనే చిర్రెత్తుకుపోయిన సంద‌ర్భాల‌ను వారు గుర్తు చేస్తున్నారు. “మీకు మాత్రం ఐదు సంవ‌త్స‌రాలు కావాలి. మాకు మాత్రం ముంద‌స్తా?“ అని ప్ర‌శ్నిస్తున్నారు. మా స‌ర్కారు ముంద‌స్తుకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని.. కేవ‌లం.. ఇదంతా ప్ర‌జ‌ల‌ను దృష్టి మ‌ళ్లించేందుకు.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సంక్షేమంపై ఎలాంటి చ‌ర్చా లేకుండా చేసేందుకు టీడీపీ చేస్తున్న ప్ర‌చారంగా అభివ‌ర్ణిస్తున్నారు. ఏదేమైనా.. ఈ రెండు విష‌యాలు హాట్ టాపిక్‌గా మార‌డం గ‌మ‌నార్హం.