రేవంత్ క్రేజ్ అప్పుడే ఎందుకు ఢ‌మాల్ అయ్యింది…!

రేవంత్ దూకుడు రాజ‌కీయాలు పార్టీ నేత‌ల్ని అయోమ‌యంలో ప‌డేస్తున్నాయా..? వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాలు తీసుకుంటూ ఒంటెత్తు పోక‌డ‌లు పోతున్నారా..? అల‌విమాలిన హామీలు ప్ర‌క‌టిస్తూ సీనియ‌ర్ల ఆగ్ర‌హానికి గుర‌వుతున్నారా..? ఆయ‌న వ్యాఖ్య‌లు బూమ‌రాంగ్ లా మారి ఇత‌ర పార్టీల‌కు ఆయుధంగా మారుతున్నాయా..? అంటే పొలిటిక‌ల్ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘోర ఓట‌మి త‌ర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది టీ కాంగ్రెస్‌. పార్టీ స‌భ్య‌త్వాల పుణ్య‌మా అని శ్రేణుల్లో క‌ద‌లిక వ‌చ్చింది. దీనికి తోడు వ‌రుస కార్య‌క్ర‌మాల‌తో రేవంత్ జోష్ పెంచారు. మ‌న ఊరు – మ‌న పోరు నినాదంతో జ‌నాల్లోకి వెళుతున్నారు. రెండు రోజుల క్రితం మొద‌టి స‌భ ప‌రిగిలో నిర్వ‌హించి విజ‌య‌వంతం చేశారు. ఆ వెంట‌నే రాష్ట్ర యువ‌సేన అధ్య‌క్షుడు శివ‌సేనా రెడ్డి గాంధీభ‌వ‌న్ లో దీక్ష చేప‌డితే దానికీ హాజ‌రై ప్ర‌సంగించారు. తాజాగా సికింద్రాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలో పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ మూడు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న రేవంత్ కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్‌, బీజేపీపై విమ‌ర్శ‌లు స‌రేస‌రి. అవి ప‌క్క‌న పెడితే రేవంత్ మాట్లాడిన కొన్ని మాట‌లు పార్టీలో దుమారం రేపేలా ఉన్నాయి. ఎన్న‌డూ లేనిది ఇంత వ‌ర‌కూ ఏ పీసీసీ చీఫ్ ఇవ్వ‌ని హామీలు స్వ‌తంత్రంగా ఇవ్వ‌డంతో సీనియ‌ర్లు అవాక్క‌య్యారు. కొన్ని వ్యాఖ్య‌లు అధికార పార్టీకి అస్త్రం అందించేలా ఉన్నాయి.

ఇంత‌కీ రేవంత్ మాట్లాడిన మాట‌లు ఏంటంటే.. కాంగ్రెస్ గెలిస్తే తొలి సంతకం ప్రగతి భవన్ ను అంబేడ్క‌ర్ నాలెడ్జ్ సెంటర్ గా మార్చుతామ‌ని తెలిపారు. గెలిచిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామ‌ని కూడా హామీ ఇచ్చారు. ఇవి పార్టీ మేనిఫెస్టోలో పెట్ట‌బోయే విష‌యాలు అని చెప్పుకున్నా.. మ‌రో కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ బాంబు పేల్చారు.

తాము అధికారంలోకి వచ్చిన తరవాత కాంగ్రెస్‌లో సభ్యులుగా చేరిన వారికే సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. వారికే మొదటగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో చేరినవాళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికే రైతు రుణమాఫీ అమలు చేస్తామని.. వాళ్లకే ఆరోగ్యశ్రీ పథకం అందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాల్లోనూ వారికే ప్రాధాన్యత ఇస్తామన్నారు.

ఈ వ్యాఖ్య‌లు శ్రేణుల‌కు ఊపు తెచ్చినా ప్ర‌జలు మ‌రోర‌కంగా ఆలోచించే ప్ర‌మాదం లేక‌పోలేదు. కాంగ్రెస్ ను గెలిపిస్తే సొంత పార్టీ నేత‌ల‌కే ప‌థ‌కాలు ఉంటాయ‌ని.. ప్ర‌జ‌ల‌కు ఉండ‌బోవ‌ని టీఆర్ ఎస్‌, బీజేపీ ఎగ‌తాళి చేయొచ్చు. సొంత పార్టీ నేత‌ల నుంచే విమ‌ర్శ‌లు రావొచ్చు. ముఖ్య‌మైన హోదాల్లో ఉండే వారు ఆచితూచి మాట్లాడాలి. మ‌రి రేవంత్ త‌న వ్యాఖ్య‌ల‌ను ఏ విధంగా స‌మ‌ర్థించుకుంటారో.. రాజ‌కీయాల్లో ఎలాంటి ప‌రిణామాలు జ‌రుగుతాయో వేచి చూడాలి.