ఆ కామెంట్లే మ‌న‌కు దెబ్బేశాయి… టీడీపీలో అంత‌ర్మ‌థ‌నం..!

రాజ‌కీయాల్లో ఉన్నాం క‌దా.. అని ఏం చేసినా చెల్లుతుందా? ఊరికేనే నోరు పారేసుకుంటే.. ఫాలోయింగ్ వ‌స్తుందా? ఇదీ.. ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో జ‌రుగుతున్న అంత‌ర్మ‌థ‌నం. నిజానికి ఇప్పుడే కాదు… గ‌తంలోనూ అనేక సంద‌ర్భాల్లో ఈ విష‌యం పార్టీలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయినా… కూడా దీనికి ఒక ద‌శ‌, దిశ పార్టీ అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌యించ‌ని కార‌ణం.. నేతలు రెచ్చిపోతున్నారు.

తాజాగా.. ఇద్ద‌రు నాయకులు చేసిన తీవ్ర విమ‌ర్శ‌ల నుంచి పార్టీని బ‌య‌ట ప‌డేసేందుకు ఎంత ప్ర‌య‌త్నం చేస్తున్నా.. ఫ‌లించ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. విశాఖ‌కు చెందిన బండారు స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి, ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి.. అయ్య‌న్న పాత్రు డు వైసీపీపై నోరు చేసుకున్నారు. ఒక‌రు మంత్రి గౌతంరెడ్డి మర‌ణంపై అత్యంత అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. వాస్త‌వానికి ఈ మ‌ర‌ణంపై ఏమైనా అనుమానాలు ఉంటే.. ఆయ‌న కుటుంబం చేసి ఉండాలి.

కానీ, బండారు అన‌వ‌స‌ర చొర‌వ చూపించారు. గౌతంరెడ్డి మ‌ర‌ణానికి, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు మ‌ధ్య లింకు పెట్టి.. రాజకీయంగా ప్ర‌యోజ‌నం పొందాల‌ని చూశారు. అయితే.. ఇది వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ, పార్టీపై మాత్రం ప్ర‌జ‌ల్లో “ ఇంత నీచంగా కూడా ఆలోచిస్తారా?“ అనే ముద్ర ప‌డిపోయింది. ఇక‌, అయ్య‌న్న పాత్రుడు.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో మాట్లాడుతూ.. మ‌రోసారి నోరు పారేసుకున్నారు. తొలిసారి గుంటూరులో ఆయ‌న సీఎం జ‌గ‌న్‌పై వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు.. అధికార పార్టీ నేత‌లు మౌనంగా ఉన్నారు. కానీ, అవే వ్యాఖ్య‌ల‌ను మ‌రోసారి అనేస‌రికి.. పోలీసులు రంగంలోకి దిగే ప‌రిస్థితి వ‌చ్చింది.

దీనినిరాజ‌కీయంగా వాడుకునేందుకు ప్ర‌య‌త్నించినా.. టీడీపీకి ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న రాలేదు. పైగా ఈ కామెంట్ల ద్వారా. పార్టీ కి ఉన్న ఇమేజ్ కూడా పోతోంద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇదే ప‌రిస్థితిని చంద్ర‌బాబు కోరుకుంటున్నారా? లేక‌.. పార్టీ నేత‌ల‌ను లైన్‌లో పెట్ట‌డం ద్వారా.. ప్ర‌జ‌ల్లో ఇమేజ్‌ను కాపాడుకుంటారా ? అనేది తేలాల్సి ఉందని అంటున్నారు ప‌రిశీల‌కులు.