రాబిన్‌శ‌ర్మ‌ను బ‌య‌ట‌కు పంపేసిన బాబు.. టీడీపీకి కొత్త వ్యూహ‌క‌ర్త‌…!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎన్నో వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి బలమైన ఇన్చార్జులు లేని నియోజకవర్గాల్లో కొత్త ఇన్చార్జిల‌ను నియమించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల సమయం ఉంది. జగన్ ఆరు నెలల ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రచారం కూడా జోరుగా నడుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీలో యువకులకు పగ్గాలు అప్పగిస్తేనే నియోజకవర్గాల్లో ధైర్యంగా ముందుకు వెళతారని… అధికార పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో పార్టీకి దాదాపు ముప్పై నియోజకవర్గాల్లో ఇన్చార్జ్ లు లేరు. జిల్లాల వారీగా ఇన్చార్జిలు లేకుండా ఖాళీగా ఉన్న చోట్ల యువకులకు ఎక్కువగా బాధ్యతలు అప్పగిస్తూ వస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సమీక్షలు చేస్తూ వ‌స్తోన్న‌ బాబు కొత్త ఇన్చార్జ్‌ల‌ ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటివరకు పార్టీ వ్యూహకర్తగా ఉన్న రాబిన్‌శ‌ర్మ టీంతో పాటు… పార్టీ ప్రోగ్రాం కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇన్చార్జిల ప్రక్రియ చేపడుతున్నారు.

ఈ క్రమంలోనే చాలా నియోజకవర్గాల్లో సీనియర్ నేతలను పక్కన పెట్టేసి.. పార్టీని ధైర్యంగా నడిపే యువ నేతలకు పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీనియర్లు పార్టీ భవిష్యత్తు నేపథ్యంలో త్యాగాలకు సిద్ధంగా ఉండాలని కూడా సంకేతాలు పంపేశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత 30 నెలల్లో ఎవరెవరు పార్టీని పట్టించుకోలేదన్న‌ది కూడా ఆరా తీస్తున్నారు.
ఇప్పటివరకూ ప్రశాంత్ కిషోర్ శిష్యుడు రాబిన్ శర్మ టీం చెప్పిన వారికే నియోజకవర్గ ఇన్చార్జిలు ఇస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు రాబిన్ టీంపై నమ్మకం కుద‌ర‌ని చంద్రబాబు ఆ టీంను పూర్తిగా పక్కన పెట్టేసి నట్టు తెలుస్తోంది.

ప్రశాంత్ కిషోర్ టీం లో ఉన్న సునీల్ తో చంద్రబాబు కొత్త డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. సునీల్ టీం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రస్తుత ఇన్చార్జిలుగా ఉన్న వారిలో కూడా కొందరు పక్కన పెట్టేసి వారి స్థానాల్లో యువకులకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వారి వల్ల కూడా ఉపయోగం లేదని భావించిన చోట వారిని పక్కన పెట్ట‌నున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఇన్చార్జిలుగా ఉన్న వారిలో కూడా కొందరు పదవులు కోల్పోనున్నారు. వచ్చే ఎన్నికలు చావోరేవో కావడంతో చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారు. మరి కొత్త వ్యూహకర్త సునీల్ టిడిపి జాతకాన్ని ఎలా మారుస్తారో ? చూడాలి.