ప్ర‌కాశంలో కొత్త మంత్రులు ఎవ‌రు.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం…!

మంత్రి వ‌ర్గం రేసులో ప్ర‌కాశం జిల్లాకు చెందిన నాయ‌కులు ప‌రుగులు పెడుతున్నారు. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా న‌లుగురు నాయ‌కులు.. త‌మ‌కు మంత్రివ‌ర్గంలో చోటు కోసం.. తీవ్ర‌స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌మ‌కు ఖ‌చ్చితంగా ఇచ్చితీరాల‌ని కూడా వారు అంటున్నారు. ఈ జాబితాలో సీనియ‌ర్లు ఉండ‌డంతో సీఎం జ‌గ‌న్‌కు ఒకింత ఇబ్బంది త‌ప్ప‌ద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. జిల్లాల విభ‌జ‌న‌లో కొత్తగా ఏర్ప‌డే ప్రకాశంజిల్లాలో ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి, గిద్దలూరు, ఎర్రగొండపా లెం, కనిగిరి, మార్కాపురం, కొండపి నియోజకర్గాలు ఉండనున్నాయి.

ఒంగోలు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల నుంచి మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రివర్గ పునర్వస్తీకరణలో వీరిద్దరు మంత్రి పదవులు కోల్పోతే ఈ రెండు నియోజకవర్గాలను తప్పించి మిగిలిన ఆరు నియోజకవర్గాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో ఉన్నారు.

దర్శి నుంచి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, గిద్దలూరు నుంచి ఎమ్మెల్యే అన్నా రాంబాబు, సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, కందుకూరు నుంచి మాజీ మంత్రి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డికి మంత్రి బాలినేనితో కొంత విబేధాలు ఉన్నాయి. దీంతో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుందా? రాదా? అనేది ప్ర‌శ్న‌గా మారింది. మరోవైపు దర్శి, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పార్టీలోనే వర్గపోరు తీవ్రంగా ఉంది. దీంతో వారికి మంత్రి పదవులు ఇస్తే ప్రత్యర్థులు పార్టీకి స‌హ‌క‌రించే ప‌రిస్థితి ఉండ‌ద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక, మిగిలిన సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు దళిత కోటాలో మంత్రి పదవి ఇవ్వాలంటే ఇటీవల ఆయనపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు స‌ర్కారుకు అడ్డంకిగా మారాయి. పైగా రైతులు కూడా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తున్నారు. దీంతో జిల్లా నుంచి మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న‌వారు క‌నిపిస్తున్నా.. మార్కులు ఎవ‌రికి ప‌డ‌తాయ‌నే చ‌ర్చ మాత్రం జ‌రుగుతోంది. లేదా.. ఎవ‌రికి కొత్త వారికి ఇవ్వ‌కుండా.. మంత్రి బాలినేని కొన‌సాగిస్తారా? అనే వాద‌న కూడా వినిపిస్తోంది.