షాకింగ్‌: జ‌గ‌న్ ముందు రెండు డిమాండ్లు పెట్టిన రోజా.. !

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు.. చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే జ‌బ‌ర్ద‌స్త్ రోజా.. రెండు ప్ర‌ధాన డిమాండ్ల‌ను తెర‌మీదికి తెచ్చారు. వాటిని నెర‌వేర్చాల్సిందేన‌ని.. ఆమె ప‌ట్టుబ‌డుతున్నారు. అంతేకాదు.. ఈ స‌మ‌స్య‌లు రెండు ప‌రిష్క‌రించ‌క‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పార్టీకి దూరం అయి..ఇండిపెండెంట్‌గా పోటీకి దిగే అవ‌కాశం కూడా ఉంద‌ని ఆమె సంకేతాలు పంపిస్తున్నారు. అయితే.. ఆమె రెండు డిమాండ్లు కూడా చాలా చిత్రంగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కొన్ని డిమాండ్లు ప్ర‌భుత్వం దృష్టికి తెస్తున్నారు.

నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధులు ఇవ్వాల‌ని.. పెండింగులో ఉన్న ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాల‌ని వారు కోరుతు న్నారు. అదేవిధంగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో త‌మ‌ను కూడా భాగ‌స్వాముల‌ను చేయాల‌ని కోరుతున్నారు. అయితే.. ప్ర‌స్తుతానికి.. ఈ ప్రాజెక్టుల విష‌యంలో ప్ర‌భుత్వం వైపు నుంచి పెద్ద‌గా రియాక్ష‌న్ క‌నిపించ‌డం లేదు. ఇదిలావుంటే.. రోజా మాత్రం దీనికి భిన్న‌మైన డిమాండ్లు తెర‌మీదికి తెస్తున్నారు. ఒక‌టి.. త‌న‌ను వ్య‌తిరేకించే వారిని పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపించాల‌ని ఆమె కోరుతున్నారు. గ‌తంలో రోజా టీడీపీ నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొన్నారు. దీనిని స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్నారు.

అయితే.. ఇప్పుడు ఆమెకు సొంత పార్టీలోనే సెగ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. రోజా కు వ్య‌తిరేకంగా కూట‌ములు పెరిగిపోయాయి. ద‌మ్ముంటే రాజీనామా చేసి గెల‌వాలంటూ.. సొంత పార్టీ నాయ‌కులే స‌వాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి వారికి చెక్ పెట్టాలంటూ.. అధిష్టానం జోక్యం చేసుకోవాల‌ని.. వారిని క‌ట్ట‌డి చేయాల‌ని.. లేదా పార్టీ నుంచి బ‌య‌టకు పంపించాల‌ని ఆమె కోరుతున్నారు. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. రోజా ప్ర‌తినిధ్యం వ‌హిస్తున్న న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాన్ని కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న శ్రీబాలాజీ జిల్లాలో క‌లుపుతున్నారు. దీనిని ఇక్క‌డి ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నారు.

ఇదే విష‌యం.. రోజాకు స్థానికంగా ఇబ్బందిగా మారింది. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని కూడా ప‌రిశీలించా ల‌ని.. న‌గ‌రిని చిత్తూరులోనే కొన‌సాగించాల‌ని ఆమె కోరుతున్నారు. ఇదే విష‌యాల‌పై.. ఆమె పార్టీ పెద్ద‌ల‌తో నూ.. ఇప్ప‌టికే చ‌ర్చించారు. అదేసమ‌యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితోనూ భేటీ అయి.. విన‌తి ప‌త్రాలు ఇచ్చారు. మ‌రి.. రోజా డిమాండ్లు ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయో చూడాలి.