వైసీపీ ఎంపీ VS ఎమ్మెల్యే పంతం…. చేజేతులా వైసీపీ ఓడుతోందా..!

ఏపీలో అధికార వైసీపీలో ప‌లు జిల్లాల్లో గ్రూపు రాజ‌కీయాలు రాజ్య‌మేలుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. ఇంకా చెప్పాలంటే 2014 ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి క‌ష్ట‌ప‌డుతోన్న వారికంటే.. 2019 ఎన్నిక‌ల్లో పార్టీ గెలిచాక ఎమ్మెల్యేల చుట్టూ చేరుతోన్న కొత్త నేత‌లు, పిల్ల గ్యాంగ్‌లు, చిల్ల‌ర నేత‌ల హంగామానే ఎక్కువుగా క‌నిపిస్తోంది. ఎమ్మెల్యేలు కూడా త‌మ గెలుపు కోసం క‌ష్ట‌ప‌డిన వారిని కాద‌ని.. త‌మ చుట్టూ చేరి భ‌జ‌న చేస్తోన్న వారికే ప్ర‌యార్టీ ఇస్తున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ స‌ర్వ‌నాశ‌నం అవుతోంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి వైసీపీలో ఇప్పుడు ఇదే జ‌రుగుతోంది.

చింత‌ల‌పూడి వైసీపీని 2014 నుంచి ఆర్థికంగా అనేక క‌ష్ట‌న‌ష్టాల‌కోర్చి న‌డిపించిన నేత‌లు చాలా మందే ఉన్నారు. ఆ టైంలో వైసీపీని న‌డిపించే నాథుడు లేక పార్టీ హైక‌మాండ్ సైతం ముగ్గురు, న‌లుగురు ఇన్‌చార్జ్‌ల‌ను మార్చుకుంటూ వ‌చ్చింది. మాజీ ఎమ్మెల్యే గంటా ముర‌ళీ ( ఎన్నిక‌ల‌కు ముందే టీడీపీలోకి జంప్ చేశారు), ద‌య్యాల న‌వీన్‌బాబు, ద‌మ్ము సుహాసిని ఇలా పలువురు మారిపోయాక చివ‌ర్లో వీఆర్ఎస్ తీసుకున్న ఐఆర్ఎస్ అధికారి వీఆర్‌. ఎలీజాకు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించారు. రాజ‌కీయాల‌కు కొత్త అయిన ఎలీజాను ముందుండి న‌డిపించింది మాత్రం ప్ర‌స్తుత ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌తో పాటు చింత‌ల‌పూడి మాజీ ఏఎంసీ చైర్మ‌న్ మేడ‌వ‌ర‌పు అశోక్‌బాబు.

ఎలీజాకు ఏ మాత్రం క‌ష్టం లేకుండా ఆయ‌న ఇన్‌చార్జ్‌గా వ‌చ్చేస‌రికే పార్టీని నాలుగు మండ‌లాల‌తో పాటు జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలో చాలా ఫిక‌ప్ చేసేశారు. చింత‌ల‌పూడి శ్రీథ‌ర్‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఆయ‌నతో పాటు అశోక్‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అందుకే ఇక్క‌డ ఏకంగా 36 వేల ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది. ఆర్థికంగా ఆశోక్, శ్రీథ‌ర్ ముందుండి పార్టీని న‌డిపించారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఎలీజా ఎంపీ శ్రీథ‌ర్ సొంత మండ‌లం కామ‌వ‌ర‌పుకోట‌పైనే త‌న ఆధిప‌త్యం చూపించాల‌ని దూకుడుగా ముందుకు వెళుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మికి ప‌నిచేసిన వారంద‌రిని వైసీపీలోకి తీసుకురావ‌డంతో పాటు టీడీపీ వాళ్ల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతోన్న ప‌రిస్థితి.

ఎంపీ శ్రీథ‌ర్‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీలో కీల‌కంగా ఉన్న అశోక్ వ‌ర్గం వాళ్ల‌కు చిన్న ప‌ద‌వి కూడా రాకుండా ఎమ్మెల్యే ప‌దే ప‌దే అడ్డుప‌డుతోన్న ప‌రిస్థితి. ఎమ్మెల్యే ఎలీజా కామ‌వ‌ర‌పుకోట మండ‌ల బాధ్య‌త‌లు, అభివృద్ధి ప‌నుల విష‌యంలో శ్రీథ‌ర్‌, ఎంపీపీ భ‌ర్త మేడ‌వ‌ర‌పు అశోక్‌కు స్వేచ్ఛ ఇస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ మండ‌లం నుంచే 8-10 వేల మెజార్టీ తీసుకువ‌చ్చే ద‌మ్ము ఉంది. శ్రీథ‌ర్ ఎంపీగా ఉన్నారు ఆయ‌నే అక్క‌ర్లేదు.. అస‌లు అశోక్‌కు కామ‌వ‌ర‌పుకోట మండ‌లంతో పాటు లింగ‌పాలెం మండ‌లంలోనూ బ‌ల‌మైన నెట్‌వ‌ర్క్ ఉంది. అక్క‌డ కూడా ఆయ‌న ప్ర‌భావం చూపుతారు.

అయితే ఎలీజా మాత్రం పార్టీ ప‌ద‌వులు, ఇత‌ర ప‌ద‌వుల విష‌యంలో వీరితో పంతం వేయ‌డంతో పాటు పార్టీ అధికారంలో ఉండి.. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీథ‌ర్‌కు ఇది సొంత నియోజ‌క‌వ‌ర్గం అయ్యి ఉండి కూడా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతోన్న వారికి న్యాయం జ‌ర‌గ‌ని ప‌రిస్థితి. ఎంపీపీ అశోక్ భ‌ర్త గ‌తంలో చింత‌ల‌పూడి ఏఎంసీ చైర్మ‌న్‌గా ప‌నిచేశారు. జ‌గ‌న్‌తో పాటు వైఎస్ కుటుంబంతో నేరుగా ఎటాచ్‌మెంట్ ఉంది. ఎంపీ, ఎమ్మెల్యే, అశోక్ ఒక్క‌టిగా ఉంటే నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవ‌చ్చు. ఇలాంటి బ‌ల‌మైన‌ కాంబినేష‌న్ ఏ నియోజ‌క‌వ‌ర్గంలోనూ సెట్ కాదు. బ‌లం, బ‌లంగం అన్నీ ఉండి కూడా అల్లుడు నోట్లో శ‌ని అన్న‌ట్టుగా త‌యారైంది చింత‌ల‌పూడి వైసీపీ ప‌రిస్థితి. ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే ఇక్క‌డ పార్టీకి కార్య‌క‌ర్త‌లు దూరం అయ్యి నాశ‌నం అయ్యే ప‌రిస్థితి ఉంది. మ‌రి ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే పంతం పార్టీని ఏ తీరానికి చేరుస్తుందో ? చూడాలి.