ఏపీలో ఒక్క‌ట‌వుతోన్న కాపులు… తెర‌వెన‌క క‌థ న‌డుపుతోందెవ‌రు..!

ఏపీ కాపు నాయకులు ఇప్పుడు మంచి వేడి మీద ఉన్నారనే చెప్పాలి. ఇటీవ‌ల వారు త‌ర‌చూ స‌మావేశ‌మ‌వుతున్నారు. వారు చాలా త్వ‌ర‌గా త‌మ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌కు రెడీ అవుతున్నారు. పార్టీల‌తో నిమిత్తం లేకుండా కాపు నాయ‌కులు త‌ర‌చూ భేటీ అవుతుండ‌డం.. ఈ భేటీలో కొంద‌రు కీల‌క కాపు నేత‌ల‌ను కూడా ప‌క్క‌న పెడుతూ ఉండ‌డంతో అస‌లు ఏం జ‌రుగుతుందో కూడా చాలా మందికి అర్థం కావ‌డం లేదు.

తాజాగా కాపు ప్రముఖులు విశాఖపట్నంలోని ఒక హోటల్లో సమావేశం అయ్యారు. గంటా శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావుతో పాటు త‌మిళ‌నాడు మాజీ సీఎస్ రామ్మోహ‌న్‌రావు, మాజీ డీజీపీ సాంబ‌శివ‌రావు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కాపు నాయ‌కులు హాజ‌ర‌య్యారు. పైకి మాత్రం వీరు కాపు కార్పోరేష‌న్‌కు ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌డం లేద‌ని.. కాపుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని పైకి చెపుతున్నారే కాని తెర‌వెన‌క చాలా ప్లాన్ ఉంద‌ని విశ్వ‌సనీయ వ‌ర్గాల టాక్ ?

బీసీ, ఎస్సీ వ‌ర్గాల్లో క‌నీసం కొంద‌రిని అయినా క‌లుపుకుపోవ‌డం ద్వారా ఫోరం ఫర్ బెటర్ ఏపీ పేరుతో సంస్థను ఏర్పాటుచేసి పోరాడాల‌ని చెప్పారు. అయితే ఇదంతా కూడా ఉత్తిత్తే అంటున్నారు. ఇటీవ‌ల త‌ర‌చూ ఏపీలోని కాపు ప్ర‌ముఖులు క‌లుస్తున్నారు. వీరు క‌ల‌వ‌డం ఇదే తొలిసారి కాదు… గ‌తంలో హైద‌రాబాద్‌లో.. అంత‌కు ముందు కాకినాడ‌లో.. గ‌తంలోనే వైజాగ్‌లో ఓ సారి క‌లిశారు.

ఈ భేటీకి గంటా శ్రీనివాస‌రావే ప్ర‌ధానంగా స్కెచ్‌లు, ప్లానింగ్ ఇస్తున్న‌ట్టు చెపుతున్నారు. ఈ భేటీల్లో క‌లుస్తున్న వారిలో ఎక్కువ మంది వైసీపీయేతర కాపులే..! ఏపీ రాజకీయాల్లో కాపుల మీద బీజేపీ చాలా ఆశ‌లు పెట్టుకుంది. ఎలాగూ రెడ్లు వైసీపీకి, క‌మ్మ‌లు టీడీపీకి ఉన్నారు. కాపుల‌ను దువ్వ‌డం ద్వారా ఏపీలో అధికారంలోకి రావాల‌ని ప్లాన్ చేస్తోంది.

వ‌ర‌సగా కాపు నేత‌ల భేటీలు.. కాపుల‌ను ఐక్యం చేసే కార్య‌క్ర‌మాల వెన‌క కూడా ఆ పార్టీయే ఉంద‌ని అంటున్నారు. బీజేపీకి ఏపీ పూర్వ, ప్రస్తుత పార్టీ అధ్యక్షులు కూడా కాపులే. కాపు యువత ఆరాధించే ప‌వ‌న్ బీజేపీతో పొత్తులోనే ఉన్నారు. ఈ ఈక్వేష‌న్లు చూస్తుంటే ఏపీలో బీజేపీ పెద్ద గేమ్ ఆడుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.