2024లో కొడాలి నానిని కొట్టేందుకు బాబు ప్లాన్ ఏ – ప్లాన్ బీలు ఇవే…!

2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారంలోకి రావటం ఎంత ముఖ్యమో… వైసీపీలో కొందరు మంత్రులు కీలక నేతలను ఓడించడం కూడా అంతే ముఖ్యం గా కనిపిస్తోంది. జగన్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న కొడాలి నాని గత రెండేళ్లుగా చంద్రబాబు లోకేష్ తో పాటు టిడిపి ఇమేజ్ చాలా వరకూ డ్యామేజ్ చేస్తూ వస్తున్నారు. విచిత్రమేంటంటే కొడాలి నాని ఓడిపోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాకుండా.. పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలతో పాటు అక్కడ అధికార టీఆర్ఎస్ – విప‌క్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు సానుభూతిపరులు కూడా కోరుకుంటున్నారు.

టీడీపీ అడ్డా కాస్తా గ‌త రెండు ద‌శాబ్దాలుగా కొడాలి నాని కంచుకోట‌గా మారిపోయింది. గత నాలుగు ఎన్నికల్లో అక్కడ వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ 2024లో కొడాలి నానిని మాజీ చేయాలని చంద్రబాబు పంతంగా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో గుడివాడలో నాని మీద టీడీపీ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్ కు 70 వేల ఓట్లు వచ్చాయి. కొడాలి నానికి 89 వేల ఓట్లు వచ్చాయి. నాని 20 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

గుడివాడ నియోజవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు 14000 ఉన్నారు. ఇక్కడ కాపులు ఓట్లు 30 వేల వరకు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీలో లేకపోవటం కొడాలి నానికి కలిసి వచ్చింది. అయితే దేవినేని వ‌ర్సెస్ వంగవీటి అన్న ఫైట్ ఎప్పటినుంచో ఉండడంతో దేవినేని అవినాష్ అక్కడ పోటీ చేయడంతో కాపు ఓటర్లు అందరూ నానికే ఓట్లు వేశారు. ఈసారి జనసేన పొత్తు నేపథ్యంలో కాపు ఓటర్ల మద్దతు కూడగట్టడంతో పాటు తమ సామాజికవర్గ ఓటర్లను ఏకం చేసి నానీని ఓడించాలని చంద్రబాబు ప్లాన్ ఏ గా పెట్టుకున్నారు.

లేనిపక్షంలో గుడివాడ నుంచి నందమూరి ఫ్యామిలీ తరపున ఎవరో ఒకరిని ఫోటీలో పెట్టాలని బాబు ప్లాన్ బీ గా అమ‌లు చేస్తున్నారు. గతంలో గుడివాడ నుంచి ఎన్టీఆర్ రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్కడ బాలయ్యను పోటీలో పెడితే ఎలా ? ఉంటుంది అన్న చర్చ కూడా పార్టీ వ‌ర్గాల్లో నడుస్తోంది. బాల‌య్య‌ హిందూపురం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో బాలయ్య గెలుపు నల్లేరు మీద నడకే కానుంది. ఒకవేళ నానిని ఓడించాలన్న‌ పక్షంలో బాలయ్యను గుడివాడ నుంచి పోటీకి దింపుదామని చంద్ర‌బాబు పార్టీ కోర్ టీంతో అన్న‌ట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ రెండు ప్లాన్ లవ్ ఏదో ఒకటి ప్రయోగించి గుడివాడలో నానిని ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు డిసైడ్ అయిపోయారు.