తొలి తెలుగు హీరోయిన్.. చివరి రోజుల్లో ఎందుకు అలా మారిపోయిందో తెలుసా?

1900 సంవత్సరంలో నాటకాల ప్రదర్శన బాగానే ఉండేది. జనాలు వీధి నాటకాలను బాగానే ఆదరించేవారు. అందులో భాగంగానే 1908లో సురభి నాటక సంస్థకు చెందిన కళాకారులు గుంటూరులో నాటకం వేస్తున్నారు. ఇంతలో ఓ పాత్ర వేస్తున్న మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఏం చేయాలో తెలియక నాటకానికి తెరదించారు. ఆ స్టేజి మీదనే ఓ నటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డే తర్వాత తెలుగు నాటక సినీ రంగ చరిత్రలో గొప్ప గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఆమె మరెవరో కాదు కమలాబాయి.. ఈ తరం వారికి అసలు ఈమె గురించి తెలియదనే చెప్పుకోవచ్చు. కానీ తను తొలి తరం హీరోయిన్. తొలి తెలుగు సినిమా భక్తప్రహ్లాదాలో హీరోయిన్‌ లీలావతి పాత్రకు ప్రాణం పోసిన గొప్ప నటి తను. సహజ నటిగా సురభి కమలా బాయికి మంచి పేరుంది. నాట్యంలో, గానంలో మంచి పట్టు ఉంది. అంతేకాదు.. అప్పట్లో తెలుగు నాటక రంగంలో ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఆమె తన నటనకు గాను ఎన్నో రజత, స్వర్ణ పతకాలను అందుకుంది. అటు 1953లో వచ్చిన అక్కలక్కలు సినిమాలో టైటిల్ రోల్ చేసింది కమలాబాయి. ఈమె పలు హిందీ సినిమాల్లో కూడా నటించింది. ఆమె నటనకు మెచ్చి ఆంధ్ర నాటక కళాపరిషత్ వారు అప్పట్లోనే ఘనంగా సత్కరించారు. అక్కడే తను 63వ ఏట 1971లో కన్నుమూసింది.

జీవితాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లిన ఆమె.. చివరి రోజుల్లో మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. కమలాబాయి సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఓ బ్యాంకులో డిపాజిట్ చేసింది. అయితే ఆ బ్యాంకు దివాళా తీసింది. ఆమె మొత్తం డబ్బును కోల్పోయింది. దీంతో తన చివరి రోజుల్లో ఆర్ధికంగా చాలా కష్టాలు పడింది. దానికి తోడు వయసు మీద పడటంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఆ సమయంలో తనకు ఎన్టీఆర్ అండగా నిలిచాడు.