హీరోల రేంజి, మార్కెట్ ను ఓ రేంజికి తీసుకెళ్లిన సుకుమార్..

సుకుమార్. లెక్కల మాస్టర్ గా పని చేసి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ క్రేజీ దర్శకుడు.. తను వేసే లెక్కలన్న పక్కాగా సక్సెస్ అవుతున్నాయి. క్రియేటివ్ దర్శకుడిగా పేరు సంపాదించిన ఆయన స్ర్కీన్ ప్లే మాస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తీసిన సినిమాల సక్సెస్ రేటు గ్రాఫ్ అమాంతం ఆకాశం వైపుగా వెళ్తోంది. ఒకప్పుడు భారతీయ సినిమా పరిశ్రమను బాలీవుడ్ దర్శకులు ఏలితే.. ప్రస్తుతం తెలుగు దర్శకులు ఏలుతున్నారు. వారిలో నెంబర్ వన్ ప్లేస్ లో రాజమౌళి నిలువగా.. రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు దర్శకుడు సుకుమార్. ఆయనకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సుకుమార్ తూర్పు గోదావరి జిల్లా మట్టపాడులో పుట్టాడు. 1970 జనవరి 11 ఆయన డేట్ ఆఫ్ బర్త్. తొలుత తను గణిత బోధకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి వచ్చాడు. ప్రస్తుతం పాన్ ఇండియన్ దర్శకుడిగా ఎదిగాడు. సుకుమార్ దర్శకత్వంలో పని చేసిన హీరోలందరికీ మంచి గుర్తింపు సక్సెస్ అందుకున్నారు. ఆయన మూలంగానే పలువురు హీరోల మార్కెట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆర్య సినిమాతో బన్నీకి సూపర్ మార్కెట్ సెట్ చేశాడు. 100% లవ్ తో నాగ చైతన్యకు మంచి సక్సెస్ అందించాడు. నేనొక్కడినే తో మహేష్ బాబుకు, నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్ కు మంచి రేంజ్ తెచ్చాడు.

ఆ తర్వాత వచ్చిన రంగస్థలం సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఒ ఐకాన్ గా నిలిచింది. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ కెరీర్ కు మైల్ స్టోన్ గా నిలిచింది. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ప్రస్తుతం వచ్చిన పుష్ప సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాతో అల్లు వారి అబ్బాయి పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు. సౌత్, నార్త్ అనే బేధం లేకుండా అద్భుత నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. తెలుగు సినిమా హీరోలతో కలిసి ఆయన చేసిన సినిమాలన్నీ ఆయా హీరోలకు మంచి మార్కెట్ అందించాయి అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.