లెక్చరర్ టు టాప్ కమెడియన్.. ఎమ్మెస్ ప్రయాణం అత్యద్భుతం..

ఎమ్మెస్ నారాయణ..టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన హాస్య నటుడు. ఆయన వేసే పంచులు.. కామెడీ టైమింగుకు అందరూ ఫిదా అయ్యేవారు. ఎన్నో వందల సినిమాల్లో నటించి జనాలను ఓ రేంజిలో నవ్వించాడు. బ్రహ్మానందం తర్వాత అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన. ఒకానొక సమయంలో ఎమ్మెస్ లేకుండా తెలుగు సినిమా ఉండేది కాదు. అలాంటిది ఎమ్మెస్.. కెరీర్ మంచి స్వింగ్ లో ఉండగానే అర్థాంతరంగా కన్నుమూశాడు. తెలుగు సినిమా పరిశ్రమ ఓ గొప్ప హాస్య నటుడిని కోల్పోయింది. 2015 జనవరి 23న అనారోగ్యంతో ఆయన అస్తమించాడు. ఈ రోజు ఆ మహా హాస్య నటుడి వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

చాలా తక్కువ సమయంలో ఆయన 700 సినిమాల్లో నటించాడు. పలు సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా అద్భుత టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆయన తెరపై కనిపిస్తే చాలు కడుపు చెక్కలయ్యేలా నవ్వేవారు జనాలు. దుబాయ్ శీను సినిమాలో సాల్మాన్ రాజ్ క్యారెక్టర్ ఆయన కెరీర్ కే హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఆయన కేవలం హాస్య నటుడే కాదు.. దర్శకుడు, నిర్మాత కూడా. తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు అందరితో కలిసి నటించిన ఆయన.. సినిమా పరిశ్రమలోకి రాక ముందు లెక్చరర్ గా పని చేశాడు. ఎంతో మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాడు.

సినిమాలపై ఇష్టంతో 1995లో లెక్చర్ ఉద్యోగాన్ని మానేశాడు. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తొలి సినిమా మానాన్నకు పెళ్లితో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎమ్మెస్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. దూకుడు సినిమాలో ఆయన నటనకు జనాలు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఆయన కామెడీకి ఎన్నో అవార్డులు రివార్డులు దక్కాయి కూడా. అంతటి గొప్ప కామెడియన్.. 2015 జనవరిలో సంక్రాంతికి సొంతూరు వెళ్లాడు. 23న హెల్త్ ప్రాబ్లంతో చనిపోయాడు. అప్పుడు ఆయన వయసు 64 ఏళ్లు. ఆయన చనిపోయిన రోజునే పటాస్ సినిమా విడుదలైంది. ఇందులో తను చేసిన కామెడీ జనాలకు బాగా నచ్చింది. తెలుగు జనాల మదిలో ఎమ్మెస్ చిరస్థాయిగా నిలిచిపోయాడు.