ఐపీఎస్‌లు సరే..మరి ఐఏఎస్‌ల బదిలీ ఎప్పుడు..?

తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు పూర్తయ్యాయి. 30 మంది అధికారులకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ముఖ్యంగా సిటీ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న అంజనీ కుమార్‌ను ఏసీబీ డీజీగా బదిలీ అయ్యారు. అలాగే హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. ఇక పలు జిల్లాల్లో ఎస్పీలను కూడా ప్రభుత్వం మార్చేసింది. ఐపీఎస్‌ అధికారుల బదిలీలు పూర్తి కావడంతో ప్రభుత్వం ఐఏఎస్‌లపై దృష్టి సారించింది. ముఖ్యమం‍త్రి కేసీఆర్‌ కూడా కలెక్టర్ల బదిలీలను చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ను ఆదేశించారని సమాచారం. సాధ్యమైనంత తొందరగా.. ఐఏఎస్‌లను బదిలీ చేయాలని పేర్కొన్నట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్లను బదిలీ చేసిన అనంతరం వారితో సమావేశం కావాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే జిల్లా కలెక్టర్లు ఉద్యోగుల విభజనలో బిజీబిజీగా ఉన్నారని, కొంత సమయం తీసుకొని వారిని బదిలీ చేద్దాని సీఎస్‌ సీఎంతో అన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాష్ట్రంలో సిద్దిపేట, మేడ్చల్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఇన్‌చార్జి కలెక్టర్ల పాలనలో సాగుతున్నాయి.

సీఎం ప్రత్యేక దృష్టి
తెలంగాణలో రెండోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచిపోయింది. మిగిలింది కేవలం రెండు సంవత్సరాలే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఇప్పటికే సూచించినట్లు తెలిసింది. మిగిలిన ఈ కొద్ది కాలం సంక్షేమ పథకాలను అందజేసి ప్రజామద్దతు కూడగట్టుకోవాలని సీఎం భావిస్తున్నారు. ఇందులో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకం కానుంది. అందుకే సీఎం ఐఏఎస్‌ల బదిలీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.

రాచకొండ పోలీసు అధికారుల వాయిదా
రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసినా రాచకొండ కమిషనరేట్‌ను మాత్రం టచ్‌ చేయలేదు. దానికి ప్రత్యేక కారణముంది. యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రభుత్వం సరికొత్తగా నిర్మించింది. ఆ ప్రారంభోత్సవంఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం కేసీఆర్‌ కూడా ఆలయ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. యాదాద్రి ఆలయం రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోకి వస్తోంది. ఈ సమయంలో అక్కడ పోలీసు అధికారులను బదిలీ చేస్తే సమన్వయం లోపిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం రాచకొండ పరిధిలో బదిలీలు ఉంటాయని తెలిసింది.