డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారిన అక్కినేని వారసుడు..!

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు అక్కినేని మనవడు సుమంత్. ఆరంభంలో సుమంత్ పై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉండగా అవి నిలబెట్టుకోవడంలో సుమంత్ విఫలమయ్యాడు. ఇన్నేళ్ల కెరీర్లో సుమంత్ సత్యం, గోదావరి సినిమాలతో మాత్రమే గుర్తింపు సంపాదించుకున్నాడు. గోల్కొండ హైస్కూల్, మళ్ళీరావా సినిమాలు కూడా పర్వాలేదనిపించాయి. ఇటీవల సుమంత్ సినిమాలు చేయడం కాస్త తగ్గించారు. ఆశ్చర్యకరంగా ఆయన ఓ సినిమాలో హీరో క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పారు.

1983లో దేశానికి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా హిందీలో 83 అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రణ్ వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్నాడు. కపిల్ దేవ్ భార్య రోమీ దేవ్ గా దీపికా పదుకొనే నటిస్తున్నారు. క్రికెటర్ శ్రీకాంత్ పాత్రను తమిళ హీరో జీవా పోషిస్తున్నారు.

ఈ సినిమా హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా డిసెంబర్ 24వ తేదీన విడుదల అవుతోంది. తెలుగు వర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో రణ్ వీర్ సింగ్ పాత్రకు హీరో సుమంత్ డబ్బింగ్ చెప్పారు. సుమంత్ వాయిస్ రణ్ వీర్ కి బాగా సూట్ అయింది. సుమంత్ మరొకరికి డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి. అలాగే అందాల రాక్షసి తో హీరోగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ కూడా ఇదే సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారాడు. ఆయన జీవా పాత్రకు డబ్బింగ్ చెప్పారు.

ఈ సినిమాను ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లపై దీపికాపదుకునే, కబీర్ ఖాన్,విష్ణువర్ధన్ ఇందూరి, సాజిద్ నదియా ద్వాలా నిర్మిస్తుండగా కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిన్న 80 మూవీ ట్రైలర్ అన్ని రిజనల్ లాంగ్వేజ్ లలో విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.