ఒకే సమావేశంలో కారు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు

నరేంద్రమోదీ కేంద్రంలో అధికారం చేపట్టి ఏడేళ్లయింది. కమలం పార్టీ జాతీయస్థాయిలో ప్రధాన పార్టీగా దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీని పక్కకు తోసి నరేంద్రమోదీ పార్టీని విజయంవైపు నడిపించాడు. ఇది ఓకే.. ఇక తెలంగాణలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా స్థానికంగా బీజేపీ నేతలతో విభేదించినా కేంద్రంలో మాత్రం మోదీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు కొనసాగించింది. ఏడేళ్లలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు పార్లమెంటులో మద్దతు తెలిపింది. మద్దతు తెలపలేని పక్షంలో సమావేశాలకు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు గైర్హాజరయ్యేవారు. అంటే పరోక్షంగా మద్దతిచ్చినట్లే. ఎందుకంటే బిల్లలను వ్యతిరేకిస్తే సభలో ఉండాలి.. వ్యతిరేకంగా ఓటు వేయాలి.. లేకపోతే కనీసం విమర్శనాత్మకంగా మాట్లడాలి. ఇవేవీ చేయలేదు కాబట్టి సపోర్టు కొనసాగిస్తున్నట్లే. ఇది ఇంతవరకు.. సీన్ కట్ చేస్తే.. పరిస్థితులు మారిపోయాయి. మీరు మీరే.. మేము మేమే అన్నట్లు రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. వరి కొనుగోలు వ్యవహారంపై కారు, కమలం పార్టీలు ఉప్పు, నిప్పులాగ తయారయ్యాయి. మీరు కొనాలంటే. . కాదు మీరే కొనాలని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన సమావేశం కాస్త ఆసక్తికరంగా అనిపించింది. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనని కారు పార్టీ సభ్యులు ఇపుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించారు. మొట్టమొదటి సారిగా నిరసన వ్యక్తం చేశారు. ఇంకో ముఖ్య విషయం ఏమంటే మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో వివిధ ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు మాజీ కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు నేత్రుత్వంలో ఎంపీలు హాజరయ్యారు. కారు పార్టీ నాయకులు సమావేశానికి రావడాన్ని చూసిన టీ.కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆశ్చర్యపోయారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీతో మేము డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ఏది ఏమైనా కారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకే సమావేశంలో పాల్గొన్నారు. ఇదీ విచిత్రం.