ఇక పొలిటికల్‌ పిచ్‌పై బౌలింగ్‌..

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సీనియర్‌ ప్లేయర్‌, ఆఫ్‌ స్పిన్నర్‌ హర్బజన్‌సింగ్‌ త్వరలో రాజకీయ మైదానంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోకున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తుంది. తాను ఏ పార్టీలోనూ చేరడంలేదని హర్బజన్‌ ప్రకటించినా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పడం రాజకీయ అరంగేట్రం ఊహాగానాలకు తావిస్తోంది. దీనికి తోడు పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, క్రికెట్‌లో హర్బజన్‌ మాజీ సహచరుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్దూ ట్విట్టర్లో ఓ ఫొటోను ఉంచాడు.

హర్బజన్‌తో తానున్న ఫోటోను పోస్ట్‌ చేసిన సిద్దూ ఆసక్తికరమైన కామెంట్‌ను కూడా జతచేశాడు. పిక్చర్‌ లోడెడ్‌ విత్‌ పాజిబిలిటీస్‌ అని పేర్కొన్నాడు. అంటే.. భవిష్యత్తులో హర్బజన్‌ పంజాబ్‌ రాజకీయాల్లో సిద్దూతో కలిసి గేమ్‌ ప్లే చేయనున్నట్లు అనుకోవచ్చని తెలుస్తోంది. తానింకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఇంకా కొంచెం సమయం తీసుకుంటానని.. అయినా సమాజానికి ఏదోకొంత తిరిగివ్వాలని అనుకుంటున్నానని పీటీఐతో చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది. ఒకవేళ రాజకీయాల్లో చేరితే ప్రజలకు ఏవిధంగా మంచినిచేయవచ్చనే దానిపైనే తన దృష్టి ఉంటుందని.. అదే తన అంతిమ లక్ష్యమని పేర్కొన్నాడు.

భజ్జీ తన భవితవ్యంపై కచ్చితంగా చెప్పకపోయినా..పంజాబ్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. అయితే భజ్జీ ఐపీఎల్‌కు మెంటార్‌గా కూడా వ్యవహరించనున్నాడు. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ లేదా ముంబయ్‌ ఇండియన్స్‌కు గానీ మెంటార్‌గా సేవలందించవచ్చు.ఈ పనులతో పాటు తన జీవితచరిత్రను కూడా వచ్చే ఆరునెలల్లో పుస్తకరూపంలో తీర్చిదిద్దనున్నాడు. ఏది ఏమైనా భజ్జీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ఎలా ప్రారంభిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.