జగన్ వెనుకడుగు వెనుక- బ్రెయిన్ ఎవరిది..?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గారు.. అని అందరూ ఎడాపెడా రాసేశారు. అలాంటి మాటలను దృష్టిలో ఉంచుకునే ఏమో.. కొన్ని గంట లతర్వాత సభలోకి వచ్చినప్పుడు ‘తగ్గేదే లే’ అని జగన్ తెగేసి చెప్పారు. మూడు రాజధానుల విషయంలో చాలా కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కూడా వెల్లడించారు. అయితే ఎందుకు వెనుకంజ వేసినట్టు?

సింహం కూడా వేటాడే ముందు ఒక అడుగు వెనక్కి వేస్తుంది.. ఆ తర్వాత.. ఉన్నపళంగా ముందుకు దూకి పంజా విసురుతుంది.. అని జగన్మోహన్ రెడ్డి అభిమానులు చెబుతున్నారు. ఈ పోలిక ఈ సందర్భానికి ఎంత మేరకు సరిపోతుందో లేదో మనకు తెలియదు. కానీ.. ప్రస్తుతానికి కొంచెం వెనుకంజ వేసిన మాట మాత్రం నిజం. ఎందుకిలా వెనుకంజ వేశారు. ఈ వెనుకడుగు వెనుకగల బ్రెయిన్ ఎవరిది? అనే సందేహాలు ఎవ్వరికైనా కలుగుతాయి.

అమరావతి రాజధానికి సంబంధించిన వ్యవహారంపై ఇప్పుడు హైకోర్టులో సీజే ఆధ్వర్యంలో ప్రత్యేకబెంచ్ రోజువారీ విచారణలు చేపట్టింది. ప్రతిరోజూ వాదనలు వింటోంది. తొలిరోజు నుంచి హైకోర్టు న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు- ప్రభుత్వ వైఖరికి ఇబ్బందికరంగానే ఉన్నాయి. ప్రభుత్వాన్ని తప్పుపట్టేలాగానే ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఈ విచారణ ఇదే వేగంతో సాగితే.. కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే.. మొత్తం కేసు తేలిపోతుందని అందరూ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి విచారణ సాగుతున్న తీరును బట్టి.. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి ప్రతికూలంగా వస్తుందనే అందరూ అనుకుంటున్నారు. ఈ పరిస్థితిని పసిగట్టలేనంత అమాయకుడు కాదు జగన్!

అదే సమయంలో ఈ కేసును ప్రభుత్వం తరఫున వాదించడానికి ప్రత్యేకంగా నియమితులైన సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా తయారైన బిల్లులను తప్పు పట్టినట్టు సమాచారం. ఈ బిల్లులు ఈ రూపంలో ఉంటే.. ఎప్పటికీ కేసు నెగ్గలేం అని న్యాయవాదులు చెప్పినట్టు సమాచారం. హైకోర్టులో కేసు పోయినంత మాత్రాన.. నష్టమేం లేదు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఉంది. అలా సుప్రీం వరకు వెళ్లినా సరే.. కేసు నెగ్గలేం అని వారు అభిప్రాయం వెలిబుచ్చారని తెలుస్తోంది. అందుకే న్యాయవాదుల బ్రెయిన్ లోంచి పుట్టిన ఆలోచనగా, ఆ బిల్లుల రద్దుకు నిర్ణయం తీసుకున్నారు.

సీఆర్డీయే రద్దును కూడా ఉపసంహరించుకున్నారు. న్యాయపరంగా చిక్కులు ఉన్నందునే బిల్లులు రద్దు చేస్తున్నట్లు ముందుగానే మంత్రి కొడాలి నాని చెప్పారు. తాను కేబినెట్ భేటీకి వెళ్లలేదంటూనే.. ఇది ఇంటర్వెల్ మాత్రమే.. సినిమా ఇంకా పూర్తి కాలేదు అని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. బిల్లుకు రూపకల్పన చేసినప్పుడే ఇలాంటి చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకోలేకపోయిన అధికార్లపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.