మాంత్రికుడి కోసం మరోసారి మారుతున్న మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేస్ సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. అయితే ఈ సినిమా పూర్తిగా ఆర్థిక నేరాల నేపథ్యంలో సాగుతుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్‌తో రెండు సినిమాలు చేసిన మహేష్, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అందుకే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను త్రివిక్రమ్ కూడా రెడీ చేశాడట. అయితే ఈ సినిమాలో మహేష్ మరోసారి పూర్తి మేకోవర్ చేయనున్నట్లు తెలుస్తోంది. సరికొత్త కథ కావడంతో ఈ సినిమాలో హీరో లుక్ కూడా కొత్తగా ఉండేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

అయితే ఈ సినిమాలో మహేష్‌ను త్రివిక్రమ్ ఎలా చూపిస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఖలేజా చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా ప్రేక్షకులను అలరించడంలో సక్సె్స్ అయ్యింది. అందుకే ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టేందుకు త్రివిక్రమ్-మహేష్‌లు ప్రయత్నిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా కోసం మహేష్ ఎలాంటి అవతారంలో కనిపిస్తాడా అనేది చూడాలి.

Share post:

Latest