వైసీపీ భ్రష్టుపట్టడానికి కొడాలినాని ఒక్కడు చాలు..!

రాజకీయాల్లో విమర్శలు చాలా సహజం. అయితే ఈ విమర్శలు అనేవి అంశాలవారీగా ఉండాలి.. ప్రభుత్వ నిర్ణయాల మీద, ప్రతిపక్షాల వ్యవహార సరళిమీద ఉండాలి అనే తరహా రాజకీయ విలువలు ఎప్పుడో మంటగలిసిపోయాయి. ఇప్పుడంతా తిట్ల పర్వమే నడుస్తోంది. ఒకరినొకరు తిట్టుకోవడం, వ్యక్తిగత తిట్లు ఇవన్నీ కూడా చాలా సహజపరిణామాలుగా వచ్చేశాయి. వీటన్నింటినీ కూడా భరించవచ్చు గానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నాని తిట్టే తిట్లను వినడం కూడా సాధ్యం కాదు.

మామూలుగానే కొడాలి నాని తిట్టే తిట్లు, వాడే పదజాలం ఆయనను ఇష్టపడే అభిమానులకు మాంచి కిక్కు ఇవ్వవచ్చునేమో గానీ.. వినే వారికి చీదర పుట్టిస్తాయి. ఒక రాష్ట్రానికి మంత్రిగా, గౌరవప్రదమైన బాధ్యతలతో ఉన్న వ్యక్తి.. ఇలాంటి పదజాలం వాడుతాడని తెలిస్తే.. ఇతర ప్రాంతాల వారు మన మొహాన నవ్వుతారు. మంత్రులు అతిథులుగా కార్యక్రమాలు నిర్వహిస్తోంటే.. మనం ఇన్విటేషన్లో ‘గౌరవనీయులైన..’ అంటూ మంత్రి పేరు ముందు జతచేస్తాం. మంత్రి పదవికి ఉండే హోదా అది. కానీ ఆ పదవిలో వాళ్లు గౌరవనీయులుగానే వ్యవహరిస్తున్నారా? అనే సందేహం కొడాలి నానిని చూసినప్పుడు కలుగుతుంది.

తెలుగుదేశాన్ని తిట్టడానికి అత్యంత నేలబారు, చవక, బజారు, నీచమైన భాష ఉపయోగించే కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎందరైనా ఉండవచ్చు. కావలిస్తే.. వారి బూతు భాషా సామర్థ్యానికి మెచ్చి.. వారందరినీ అధికార ప్రతినిధులుగా నియమించి.. టీవీ చానెళ్లలో చర్చలకు వారినే తోలుతుండవచ్చు. అలాంటి వారి గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. మంత్రి పదవిలో ఉంటూ నీచమైన భాషను ఉపయోగించడం పార్టీక గౌరవాన్ని మంటగలిపేస్తుందనే స్పృహ లేకపోతే ఎలాగ?

చంద్రబాబునాయుడు పేరెత్తితే కొడాలి నాని ఎన్ని రకాలుగా తిడతారో అందరికీ తెలుసు. శుక్రవారం సభలో అలాంటి రాద్ధాంతమే జరిగింది. సభలో తన భార్యను ప్రస్తావించి అసభ్యంగా మాట్లాడే సరికి చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన కన్నీళ్లకు కారణమైన వారు కిమ్మనకుండా ఉంటే సరిపోయేది. కానీ కొడాలి నాని అక్కడితోనూ ఆగలేదు.

చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారంటూ దెప్పిపొడిచారు. ఏడుస్తున్నట్లుగా నటించాడని, కన్నీళ్లు రావడం లేదు గనుక.. చేతులు రెండూ మొహానికి అడ్డు పెట్టుకుని డ్రామా చేశాడని అన్నారు. రివర్సులో తనకు మొహం చెల్లదు గనుక.. అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడానికి చంద్రబాబునాయుడే కట్టుకున్న భార్యను రచ్చకీడ్చిన నీచుడని కూడా వ్యాఖ్యానించారు.

కొడాలి నాని దూకుడు, అసహ్యమైన తిట్లు, భాష.. ప్రభుత్వ అధినేతకు చాలా హాయిగా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ ప్రజల్లో కాస్త ఆలోచించే వాళ్లు సభ్యతకు, గౌరవానికి విలువ ఇచ్చేవాళ్లు అసహ్యించుకుంటూ ఉంటారని జగన్ తెలుసుకోవాలి. కొడాలి నాని పోకడలు ఇలాగే శృతిమించిపోతూ ఉంటే.. ఆ ప్రభావంతో పార్టీనే భ్రష్టుపట్టిపోతుందని కూడా తెలుసుకోవాలి.