రాజా విక్రమార్క మూవీ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: రాజా విక్రమార్క
నటీనటులు: కార్తికేయ, తాన్య రవిచంద్రన్, సాయి కుమార్ తదితరులు
సినిమాటోగ్రఫీ: పిసి మౌళి
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
దర్శకుడు: శ్రీ సరిపల్లి

ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన హీరో కార్తికేయ ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తున్నా, అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ రావడం లేదు. ఇక దీంతో తనదైన శైలిలో విభిన్న కథాంశాలను సినిమాలుగా చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. కాగా తాజాగా కార్తికేయ నటించిన చిత్రం ‘రాజా విక్రమార్క’ పోస్టర్స్, టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
రాజా విక్రమార్క(కార్తికేయ) ఒక NIA ఏజెంట్. హోమ్ మినిస్టర్ అయిన సుకుమార్(సాయి కుమార్)కు రక్షణగా సీక్రెట్ మిషన్‌లో ఉంటాడు హీరో. ఈ క్రమంలో హోమ్ మినిస్టర్ కూతురు కాంతి(తాన్య రవిచంద్రన్)తో ప్రేమలో పడతాడు హీరో. అయితే వీరి ప్రేమకు హోమ్ మినిస్టర్ ఒప్పుకుంటాడా? ఈ క్రమంలో హోమ్ మినిస్టర్‌పై జరిగే ఓ అటాక్‌ను రాజా విక్రమార్క ఎలా అడ్డుకుంటాడు? అసలు హోమ్ మినిస్టర్‌పై అటాక్ చేసింది ఎవరు? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రాజా విక్రమార్క’ అనే టైటిల్‌ను మరోసారి వాడుకుని ఓ పక్కా థ్రిల్లర్ మూవీతో మనముందుకు వచ్చాడు హీరో కార్తికేయ. అయితే ఈ సినిమా కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం, ఈ సినిమాను ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించడంతో ఎన్నో లోపాలు ఉన్నట్లు ప్రేక్షకులు ఫీలవుతారు. దీంతో ఈ సినిమా వారికి ఏమాత్రం నచ్చదనే చెప్పాలి. ఇక ఈ సినిమా కథనం విషయానికి వస్తే.. ఓ NIA ఏజెంట్‌గా హీరో ఎంట్రీ, హోం మినిస్టర్‌ను కాపాడే మిషన్‌లో అతడు ఉండటం.. ఈ క్రమంలోనే హోం మినిస్టర్ కూతురితో లవ్ ట్రాక్ ఇలా వరుసగా రొటీన్ స్టఫ్‌తో నింపేశారు చిత్ర యూనిట్. అయితే హోం మినిస్టర్‌పై జరిగే ఓ అటాక్‌తో ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.

ఇక సెకండాఫ్‌లో హోం మినిస్టర్‌పై అటాక్ ఎవరు చేశారనే విషయాన్ని చేధించేందుకు హీరో ఎలాంటి ప్రయత్నాలు చేశాడు.. చివరకు అసలు నిందితులను అతడు పట్టుకుంటాడా లేడా అనేది సినిమా కథగా మనకు చూపించారు. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్‌లో కేవలం యాక్షన్ సీక్వెన్స్‌లను వాడటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ప్రేక్షకులు ఫీలవుతారు. ఇక సినిమా అయిపోయాక వారు తలపట్టుకునే బయటకు రావడం మనకు కనిపిస్తుంది.

ఓవరాల్‌గా చూస్తే రాజా విక్రమార్క చిత్రం కూడా ఓ చెత్త సినిమాగానే మిగిలిపోయిందని చెప్పాలి. ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఏమీ లేకపోవడం ఈ సినిమాకు మేజర్ బ్లో అని చెప్పాలి. ఇక ఈ సినిమాలోని కథ అప్పుడెప్పుడో చూసిన సినిమాలను గుర్తుకు చేయడంతో ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ లేకపోవడం ఈ సినిమా ఫెయిల్యూర్‌కు మరో కారణం అని చెప్పాలి. దర్శకుడు శ్రీ సరిపల్లి కొత్తవాడు కావడంతో అతడు ఈ సినిమాను హ్యాండిల్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
NIA ఏజెంట్‌గా కార్తీకేయ పర్ఫెక్ట్‌గా కనిపించాడు. అయితే యాక్టింగ్‌కు పెద్దగా స్కోప్ లేని పాత్ర కావడంతో కేవలం యాక్షన్ సీన్స్‌తోనే మనోడు ఈసారికి నెట్టుకొచ్చాడు. ఇక హీరోయిన్‌గా తాన్య రవిచంద్రన్ కూడా కేవలం అందాల ఆరబోతకు మాత్రమే ఉపయోగపడింది. సాయి కుమార్ లాంటి సీనియర్ యాక్టర్‌కు మంచి రోల్ పడినా, దానిని పూర్తిగా వినియోగించుకోవడంలో చిత్ర యూనిట్ ఫెయిల్ అయ్యింది. మిగతావారు పెద్దగా సినిమాకు చేసిందేమీ లేదు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు శ్రీ సరిపల్లి ఎంత కొత్తవాడు అయితే మాత్రం ఇలాంటి కాప్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎంచుకున్నప్పుడు దాన్ని ఎలివేట్ చేసే విధానంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఎంతసేపు హీరోను ఎలివేట్ చేసే ప్రయత్నమే తప్ప కథపై పట్టును పూర్తిగా కోల్పోవడంతో ఈ సినిమా పక్కదారి పట్టింది. ఇక ఈ సినిమాకు ప్లస్ అయ్యింది సినిమాటోగ్రఫీ అని చెప్పాలి. సంగీతం కూడా పర్వాలేదనిపించింది. అటు నిర్మాణ విలువలు, ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బాగుండాల్సింద.

చిరవగా:
రాజా విక్రమార్క – యుద్ధం చేయకుండానే చేతులెత్తేసిన రాజా!

రేటింగ్:
2/5