మూడేళ్లలో ముగ్గురు..

రెండంటే రెండే రోజులు గడిస్తే.. ఆ తరువాత ఆయన మాజీ.. అంతే ఇంతకాలం ఉన్న హోదా.. దర్పం.. ప్రభుత్వ అధికారులపై అజమాయిషీ ఇక ఏవీ ఉండవు.. అందరిలాగానే ఆయన కూడా మాజీ అధికారుల జాబితాలో చేరిపోతారు. అంతలోపే ఓ సంతోషకరమైన వార్త అతనిని పలకరంచింది. మీ సేవలు బాగున్నాయి.. మరికొంతకాలం మీరు సర్వీసులో ఉంటారు.. అని ఆయనకు సమాచారం వచ్చింది. ఇంకేముంది.. ఆయన హ్యాపీ.. ఆయనతో పాటు అధినేత కూడా హ్యాపీ.. ఆ వ్యక్తి ఎవరంటే సమీర్ శర్మ.. ఏపీకి చీఫ్ సెక్రెటరీగా పనిచేస్తున్న సమీర్ శర్మ సర్వీసును మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈనెల 30తో సమీర్ శర్మ పదవీ విరమణ చేయాలి. అయితే ఆయన సేవలు ఇంకా అవసరమని.. సర్వీసు కాలాన్ని పొడిగించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి గతంలో లేఖ రాశారు. చాలా రోజుల పాటు ఈ విషయంపై మౌనం దాల్చిన మోదీ ప్రభుత్వం రిటైర్ మెంట్ కు రెండు రోజుల ముందు తీపికబురు పంపింది. దీంతో ఆయన 2022 మే వరకు సర్కారు సేవలో ఉంటారు. ఇదిలా ఉండగా జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పట్లో ఎల్ వీ సుబ్రమణ్యం సీఎస్ గా ఉండేవారు. ఎన్నికల సమయంలో ఎలెక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎల్ వీ ..సీఎస్ బాధ్యతలు చేపట్టారు.

జగన్ వచ్చిన తరువాత ఆయననే కంటిన్యూ చేశారు. అయితే ఉన్నట్టుండి ఎల్వీఎస్ ను పదవినుంచి జగన్ తప్పించి నీలం సాహ్నిని నియమించారు. ఆమె పదవీ కాలం పొడిగించాలని గతంలో కూడా కేంద్రానికి లేఖరాస్తే మోదీ సర్కారు సానుకూలంగా స్పందించి పదవీ కాలాన్ని పెంచింది. ఇపుడు సమీర్ శర్మ కు కూడా మరో అవకాశమిచ్చింది. ఇలా జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ముగ్గురు సీఎస్ లను చూశారు. ఇంకా చూస్తారు కూడా.. ఎందుకంటే సమీర్ శర్మ 2002 మేలో రిటైర్ అవుతారు కాబట్టి.. ఆ తరువాత మరో సీఎస్ నియమితులవుతారు.