చెర్రీ, స‌మంత‌ ‘లిప్ లాక్‌’ సీన్ వెనుక ఇంత కథ నడిచిందా..?

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత అక్కినేని హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం రంగస్థలం. చక్కని కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. సుకుమార్, రామ్ చరణ్ ఈ చిత్రంతో తమ సత్తా ఏంటో నిరూపించారు. చెర్రీ తన సహజ నటనతో ఆకట్టుకుంటే.. సుకుమార్ తన క్రియేటివిటీతో సినీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ సినిమా రంగస్థలం అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎంతగా అలరిస్తాయో.. రొమాంటిక్ సన్నివేశాలు కూడా అంతే ఎంటర్టైన్ చేస్తాయి. చరణ్, సమంతాల మధ్య రియలిస్టిక్ లవ్ స్టోరీ మనసులను హత్తుకుంటుంది. చిట్టిబాబు శేషునాయుడిని కొట్టినప్పుడు ఎస్సై స్టేషన్ పిలిపించే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశానికి ముందు సమంత చిట్టిబాబుకి తన ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆ సమయంలోనే పోలీసులు చిట్టిబాబును తీసుకెళ్తుంటే ఒక ఇంటెన్స్ లిప్ లాక్ ఇస్తుంది. ఈ సన్నివేశం అప్పట్లో అనేక చర్చలకు దారి తీసింది. అయితే ఈ సీన్ వెనుక చాలా కథ నడిచిందట.

సుకుమార్ చరణ్ కి స్క్రిప్ట్ వినిపించినప్పుడే ఈ కిస్ సీన్ గురించి చెప్పారట. కానీ చరణ్ మాత్రం తనకి పెళ్లయిందని.. అందుకే ఇలాంటి సన్నివేశాలు చేయడం తన వల్లకాదని ఖ‌రాఖండీగా చెప్పేశారట. ఇలాంటి సన్నివేశాలు చేస్తే తన సతీమణి ఉపాసనకి అస్సలు నచ్చదని సుకుమార్ కు నచ్చజెప్పారట. దాంతో సుకుమార్ అయిష్టంగానే సరైనన్నారట. కానీ మనసులో మాత్రం ఈ సన్నివేశం కచ్చితంగా రామ్ చరణ్ తో చేయించాలని సుక్కు దృఢంగా అనుకున్నారట. ఇందుకోసం, చరణ్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు అడిగి సీన్ కి ఒప్పిద్దామని ఫిక్స్ అయ్యారట. కానీ ప్రతిసారీ చరణ్ తనకు ఇలాంటివి అస్సలు నచ్చవని తేల్చి చెప్పేవారట.

ఇక చివరాకరికి ఆ సన్నివేశం చిత్రీకరణ చేసే సమయం రానే వచ్చింది. ఆ టైంలో.. ‘చరణ్ కి లిప్ కిస్ ఇవ్వు’ అని సమంతాకి సుకుమార్ చెప్పారు. చరణ్ కి మాత్రం.. ‘సమంత పెదాలు నీ దగ్గరకు వస్తాయంతే.. నిజంగా లిప్ లాక్ అనేది ఏం జరగదు. తర్వాత దీన్నే గ్రాఫిక్స్ లో లిప్ లాక్ లా చూపించేద్దాం’ అని చెప్పారు. దాంతో చరణ్ ఓకే అనేసరికి షూట్ కి రెడీ చేశారు. ఇక సుక్కు యాక్షన్ అని చెప్పిన మరుక్షణమే సమంత వేగంగా వెళ్లి చరణ్ కి నిజంగానే లిప్ కిస్ ఇచ్చేసారు. ఆ క్షణంలో చరణ్ కూడా ఒక్క సారిగా షాక్ అయ్యారట. ఇలా చేయడం ఏం బాగోలేదని సుకుమార్ పై అలిగారట. కానీ సుకుమార్ ఈ సన్నివేశం సినిమాలో ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా చెప్పి ఎలాగోలా కన్ విన్స్ చేసారట. ఇదే సన్నివేశంలో రామ్ చరణ్ తిరిగి సమంతాకి కిస్ ఇచ్చే సీన్ కూడా ఉంటుంది. ఈ షాట్ లో మాత్రం చరణ్ సమంతను నిజంగా కిస్ చేయలేదు.