ఒక్కడి కోసం వెయ్యి మంది పోలీసులు..పోలీసు వ్యవస్థనే సవాల్ చేస్తున్న ఉన్మాది..

ఒక్కడు.. కేవలం ఒకే ఒక్కడు.. మొత్తం పోలీసులనే సవాల్ చేస్తున్నాడు.. అతనేమీ పెద్దగా చదువుకొనిందీ లేదు.. అంత తెలివి వంతుడు కూడా కాదు.. గంజాయి, మద్యానికి అలవాటు పడ్డ వాడు..రోజు కూలీ పనిచేసుకుంటూ బతుకున్న యువకుడు.. వారం రోజులుగా తెలంగాణ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ ఓ కుటుంబానికి రోదన, ఆవేదనను మిగిల్చాడు. అతడే ..రాజు.. హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిని దారుణంగా లైంగిక దాడి చేసి.. హత్యచేసిన నిందితుడు. చాక్లెట్ ఆశ చూపించి అభం, శుభం తెలియని చిన్నారికి మాయమాటలు చెప్పి ఉన్మాదిలా ప్రవర్తించాడు. ఏం జరుగుతోందో తెలియక.. ప్రతిఘటించలేక ఆరేళ్ల చిన్నారి పంటికిందే బాధను ఓర్చుకొని జీవితాన్ని చాలించింది. ఈ దారుణం జరిగిన అనంతరం ఆ యువకుడు తన యజమానితో రూ.1800 తీసొకిన స్నేహితుడి సాయంతో నింపాదిగా వెళ్లిపోయాడు.

ఎక్కడకు వెళ్లాడో..

నగరంలోఎటు చూసినా సీసీ కెమెరాలుంటాయి.. చీమ చిటుక్కుమంటే పట్టుకుంటామని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది.. ఇంత వ్యవస్థ ఉన్నా ఆ ఉన్మాది మాత్రం దర్జాగా టోపీ పెట్టుకొని వెళ్లాడు. అతడెవరనేది తెలిసింది కానీ.. ఎక్కడకు వెళ్లాడు అనేది ఇంతవరకు తెలియడం లేదు. మొన్న కేటీఆర్ తన ట్విట్టర్ లో నిందితుడు దొరికాడు.. శిక్షిస్తాం అని చెప్పాడు. ఆరా తీస్తే దొరికింది అనేది అబద్ధమని తేలింది. ఆ తరువాత.. తనకు తప్పుడు సమాచారం వచ్చింది.. అందుకే అలా పోస్ట్ చేశా అని కేటీఆర్ వివరణ ఇచ్చుకున్నాడు.

సెల్ ఫోన్ వాడనందువల్లే తెలియని ఆనవాళ్లు

నిందితుడు తను వాడుతున్న సెల్ ఫోన్ ను సంఘటన జరిగిన క్షణం నుంచీ వాడటం మానేశాడు. స్విచ్చాఫ్ చేసి ఎక్కడో పడేశాడు. దీంతో అతనెక్కడున్నాడో అనే విషయం పోలీసులకు కూడా అంతుబట్టడం లేదు. ఒకవేళ ఫోన్ వాడితే టెక్నాలజీ వాడి.. సిగ్నల్ ఏ ప్రాంతంలో ఉందో కనుక్కొని..అక్కడి పోలీసులను అలర్ట్ చేసేవారు. ఇది ముందుగా తెలుసుకున్న ఉన్మాది మొబైల్ వాడటమే మానేశాడు.

జల్లెడ పడుతున్న పోలీసులు

ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో డీజీపీనే నేరుగా పర్యవేక్షిస్తున్నారు. నిందితుడిని పట్టిస్తే రూ. పది లక్షల రివార్డు అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. దాదాపు వెయ్యి మంది పోలీసులు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ప్రధాన రోడ్లు, హైవేలలో సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడి ఆనవాళ్లు ఎక్కడెక్కడ లభ్యం కావచ్చో ఆరా తీసి అక్కడకు వెళుతున్నారు. అయినా ఇంతవరకు అతని గురించి తెలియదు.

రాజకీయ పార్టీలు కూడా వెతికించాలి

బాలిక చనిపోయి ఆ కుటుంబం ఆవేదనలో ఉంటే నిత్యం నాయకులు అక్కడకు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇపుడు చేయాల్సింది ఇది.. కాదు.. నిందితుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే పార్టీలు కూడా కార్యకర్తలను అప్రమత్తం చేయాలి.. నిందితుడి ఫొటోను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులకు షేర్ చేసి వెతకమని చెప్పాలి. అన్ని పార్టీల కార్యకర్తలు ఒక బాధ్యతగా తీసుకొని నిందితుడిని వెతికితే కచ్చితంగా దొరుకుతాడు.