ముందే ముస్తాబైన ఖైరతాబాద్ వినాయకుడు..ప్ర‌త్యేక‌తలు ఇవే!

వినాయ‌క‌చ‌వితి( ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 10).. పిల్లలు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా చేసుకునే పండ‌గ. వినాయకుని పుట్టిన రోజైన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి పండుగగా అందరూ జరుపుకుంటారు. అయితే వినాయ‌క చ‌వితి వ‌స్తోందంటే అంటే అంద‌రి మ‌దిలో ముందుగా మెదిలేది ఖైర‌తాబాద్ బొజ్జ వినాయ‌కుడే.

Khairathabad Ganesh Live #Khairatabad Ganesh# 2021 India's Biggest Ganesh - YouTube

ఈ సారి చ‌వితి రాక ముందే ఖైరతాబాద్ వినాయకుడు ముస్తాబైయ్యాడు. గతేడాది కరోనా కారణంగా 11 అడుగుల విగ్రహానికే పరిమితమైన నిర్వాహకులు ఈసారి 40 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పు, 28 టన్నుల బరువున్న వినాయకుడిని తీర్చిదిద్దారు. ప్ర‌తి ఏడాది ఏదో ఒక ప్రత్యేకతను చాటే ఖైరతాబాద్ విఘ్నేషుడు ఈ సారి ద్వాదశాదిత్య మహా గణపతిగా కొలువుదీరనున్నాడు. 12 తలలు, 24 చేతులు, ఆరు సర్పాలు, సప్తాశ్వాలతో కూడిన సూర్యరథంపై గణనాథుడిని తీర్చిదిద్దారు.

Khairatabad Ganesh 2021 | India's Biggest Ganesh 2021 | Ganapthi Making Idol | PSR Palleturi Channel - YouTube

అలాగే వినాయ‌కుడి కుడి వైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి.. ఎడమ వైపున బ్రహ్మా, విష్ణు, మహేశ సమేత దుర్గాదేవిని అమ‌ర్చారు. మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ విగ్రహ తయారీ కోసం వివిధ రాష్ట్రాల నుంచి 150 మంది కళాకారులు మూడు నెల‌ల పాటు రాత్రుంబవళ్లు శ్రమించారు. ఇక అందంగా, అద్భుతంగా ముస్తాబైన ఖైర‌తాబాద్ గ‌ణేషుడిని చూసేందుకు భక్తులు అప్పుడే క్యూకడుతున్నారు. కాగా, ఈ నెల 10 గణేశ్ నవరాత్రులు ప్రారంభం కానుండగా, 19న నిమజ్జనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.