మోదీ దీపావళి బహుమతి : రైతులకు ఏడాదికి ఇకపై రూ.12 వేల సాయం..!

కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏడాదికి రూ. ఆరు వేల సహాయాన్ని రైతులకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రైతులకు అందజేసే సాగు సాయాన్ని రెండింతలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం రైతులకు సాగులో పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ. 6000 అందజేస్తోంది. ఈ మొత్తాన్ని ఏడాదిలో మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ. 12000 చేసి రైతులకు అందజేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

దీపావళి పండుగ లోపు దేశంలోని 12 కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ బహుమతి ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. ఈ విషయమై ఇప్పటికే జాతీయ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి అమరేంద్ర ప్రతాప్ సింగ్.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో కలిశారు.

అనంతరం అమరేంద్ర ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మన్ నిధి మొత్తం రెట్టింపు చేస్తున్నట్లు తెలిపారు.అప్పట్నుంచి దీనిపై వార్తలు వస్తున్నాయి. త్వరలో ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు జరిగే లోగానే రైతుల కోసం అందజేస్తున్నారు రూ. 6000 మొత్తాన్ని రూ. 12000 గా చేసి మూడు వాయిదాల్లో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోందని తెలుస్తోంది.