కోవిడ్ టైంలో అందరికీ ఫెయిల్యూర్స్.. ఆ స్టార్ కు మాత్రం బ్లాక్ బస్టర్స్..!

దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలు కష్టాల్లో కూరుకుపోయాయి. కరోనా టైంలో షూటింగ్ ఆగిపోయి కొన్ని సినిమాలు, షూటింగ్ పూర్తయి విడుదలకు నోచుకోని సినిమాలు, థియేటర్లలో సినిమాలు విడుదలై కలెక్షన్లు లేక చాలా మంది నష్టాలపాలయ్యారు.కానీ కొన్నేళ్లుగా హిట్టు ముఖం ఎరుగని ఇద్దరు అగ్ర హీరోలు మాత్రం కోవిడ్ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకొని తిరిగి ఫామ్ అందుకున్నారు.

ఆ అగ్ర హీరోలు ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, ఆర్య. సూర్యకు సింగం సిరీస్, 24 మూవీ విడుదలైన తర్వాత చాలా ఏళ్ల నుంచి హిట్ సినిమా పడలేదు. సూర్యకు విజయాల కొరత తీరుస్తూ ఈ ఏడాది ఆయన నటించిన ఆకాశం నీ హద్దురా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయం సాధించడమే కాక విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది. అలాగే మరో హీరో ఆర్యకు 2013లో విడుదలైన రాజారాణి సినిమా తర్వాత సరైన విజయం అందలేదు. సైజ్ జీరో, గజనీకాంత్, కాప్పన్ తదితర సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

కానీ ఈ ఏడాది ఆర్య పా. రంజిత్ దర్శకత్వంలో నటించిన సార్పట్టా పరంపరై సూపర్ హిట్ గా నిలిచింది. ఉత్తర చెన్నై బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆర్య చాలా ఏళ్ల తర్వాత తన ఖాతాలో మంచి విజయాన్ని వేసుకున్నాడు. కోవిడ్ టైం లో చాలా మంది హీరోలు, హీరోయిన్లు అపజయాలు ఎదుర్కోగా.. సూర్య, ఆర్య మాత్రం తమ కెరీర్లో మర్చిపోలేని విజయాలను అందుకున్నారు.