హడలెత్తిస్తున్న డెంగ్యూ..సోకింది.. డెంగ్యూనా.. కరోనానా తెలుసుకోండిలా..!

వర్షాకాలం ప్రారంభం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సీజనల్ వ్యాధులు కూడా విపరీతంగా ప్రబలుతున్నాయి. వైరల్ ఫీవర్ బారినపడి ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రెండు రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలు రంగంలోకి దిగి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గినప్పటికీ రెండు రాష్ట్రాల్లో చెప్పుకోదగిన సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో పోలిస్తే కాస్త కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో డెంగ్యూ ఫీవర్ సోకినా సోకింది కరోనా నేమోనని ప్రజలు భయపడుతున్నారు. లక్షణాలు చాలావరకు ఒకేలా ఉండడం ఈ భయాందోళనకు కారణం.

కరోనా, డెంగ్యూ లక్షణాలు ఇవే..

కోవిడ్ వచ్చినవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. అలాగే వారు రుచి, వాసన చూసే శక్తి కోల్పోతుంటారు. గొంతు నొప్పి ఉంటుంది. ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉంటాయి. జ్వరం, పొడిదగ్గు, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు ఈ వైరస్ బారిన పడ్డ వారిలో ఉంటాయి.

డెంగ్యూ సోకిన వారికి లక్షణాలు ఎలా ఉంటాయంటే.. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు, జ్వరం, అలసట,వికారం, వెన్ను నొప్పి కడుపు నొప్పి, కళ్ళ వెనుక నొప్పి,కీళ్ల నొప్పులు కనిపిస్తాయి. ఈ లక్షణాలను బట్టి వ్యాధి బారినపడ్డది డెంగ్యూ వల్లనా.. లేక కరోనా వల్లనా అన్నది నిర్ధారించుకోవచ్చు.