మా ఎన్నికల్లో చిత్ర విచిత్రం.. బండ్ల గణేష్ స్టైలే వేరప్పా..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కు అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధ్యక్ష రేసులో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా ముందు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా అని ప్రకటించిన జీవితారాజశేఖర్ అనూహ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ లోకి మారింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తోంది. జీవిత రాకతో ప్రకాష్ రాజ్ ప్యానెల్లో కీలకంగా ఉన్న బండ్ల గణేష్ బయటకు వచ్చి స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

బండ్ల గణేష్ ముందుగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని అంతా భావించగా ఇప్పుడు సడన్ గా ట్విస్ట్ ఇచ్చాడు. జనరల్ సెక్రటరీ గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. బండ్ల గణేష్ ఒక ప్రత్యేకమైన పంథా గల వ్యక్తి అని తెలిసిందే. మా ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన ప్రత్యేకమైన పంథాను అనుసరిస్తున్నాడు. వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు.’ఒకే ఒక్క ఓటు మా కోసం మన కోసం మన అందరి కోసం మా తరఫున ప్రశ్నించడం కోసం అంటూ ఈ పోస్టర్ ను బండ్ల గణేష్ ట్విట్టర్ లో విడుదల చేశాడు.

ఆ పోస్టర్ లో టాలీవుడ్ అగ్ర హీరోల పేర్లు అన్ని వచ్చేలా చూసుకున్నాడు. ఆ పోస్టర్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్,పవన్ కళ్యాణ్,మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాని, నాగశౌర్య, రానా, నాగచైతన్య, అల్లరి నరేష్,అల్లు శిరీష్, సందీప్ కిషన్, గోపీచంద్, అఖిల్ అక్కినేని పేర్లు ఉన్నాయి. వేదికలపై ప్రత్యేకంగా మాట్లాడటమే కాదు.. మా ఎన్నికల ప్రచారంలో కూడా వినూత్నమైన పంథాను అనుసరించడం పై బండ్ల గణేష్ ను అభిమానులు ప్రశంసిస్తున్నారు.