జాన్సన్ అండ్ జాన్సన్ వాక్సిన్‌కి కేంద్రం అనుమతి…?

కొవిడ్ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించేందుకుగాను ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయగా, ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేందుకుగాను మందుకొస్తున్నారు. ఫస్ట్, సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకుని ప్రభుత్వ సూచనలను పాటిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ఎక్కువ మందికి అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ఈ కంపెనీల వ్యాక్సిన్లు తీసుకున్నారు కూడా.

కాగా తాజాగా కేంద్రం మరో వ్యాక్సిన్ యూసేజ్‌కు పర్మిషన్ ఇచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ అనుమతితో భారత్ తన వ్యాక్సిన్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకున్నదని పేర్కొన్నారు. ఇది భారత్‌లో వినియోగించనున్న ఐదో టీకాగా ఉండబోతున్నది. కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్, మోడెర్నా మొదటి నాలుగు వ్యాక్సిన్స్ కాగా ప్రజెంట్ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు కేంద్రం అనుమతులిచ్చింది.