’ఇంద్రవెల్లి‘ సభ గులాబీలో గుబులు పుట్టించిందా..?

రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ నాయకులు తిడుతుంటే కాంగ్రెస్ నాయకులు సంబరపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంటే ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. తమ పార్టీకి పూర్వపు రోజులు వచ్చేశాయని హుషారుగా ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపితే గులాబీ పార్టీలో గుబులు రేపిందనే చెప్పవచ్చు. అరె.. ఇదేంది రేవంత్ సభకు ఇంత జనం వచ్చారు.. అని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారట. అంతేకాక.. కాంగ్రెస్ సభకు మీడియా కూడా అధిక ప్రాధాన్యతే ఇచ్చింది. దాదాపు అన్ని పేపర్లు దళిత గిరిజన సభను హైలైట్ చేశాయి. ఇక సోషల్ మీడియాలో ఈ కార్యక్రమం హల్చల్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సభ సన్నివేశాలను వైరల్ చేస్తున్నారు. ఇవి టీఆర్ఎస్ నాయకుల మొబైల్స్ లో కూడా చేరాయని తెలిసింది. రేవంత్ ప్రసంగాన్ని మొత్తం టీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా విన్నాయి. అందుకే ఒక రకమైన చలనం వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే సమస్య ఎక్కువవుతుందని భావించిన గులాబీ బాస్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులచే ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టిస్తూ మాట్లాడిస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పీయూసీ చైర్మెన్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జోగు రామన్న తదితరులు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంతోపాటు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఓ దశలో ఆయన చేతులు, కాళ్లు నరుకుతాం అని కూడా అన్నారంటే వారెంత అసహనంతో ఉన్నారో అర్థమవుతోంది. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే కాళ్లు, చేతులు నరికేస్తామని టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాయంలో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో ఎమ్మెల్యే జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలకు ఇదేంది.. ఇలా మాట్లాడుతున్నాడని మీడియా ప్రతినిధులే ఆశ్చర్యపోయారు. రేవంత్ ది శునకానందం అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అంటే..దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీచేయ్ అని పీయూసీ చైర్మెన్ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయనకు పదవులు, డబ్బే ముఖ్యమని, బ్యాక్ మెయిల్ రాజకీయాలకు పెట్టింది పేరని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనవిధంగా కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరపడుతున్నారు.

Share post:

Latest