స్వర్గాన్ని రెడీ చేసుకుంటున్న బంగార్రాజు

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల ఏ సినిమా చేసినా అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండటంతో ఆయన చాలా నిరాశకు లోనవుతున్నారు. దీంతో ఎలాగైనా తాను మరోసారి అదిరిపోయే హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే గతంలో ఆయన నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ను తెరకెక్కించాలని చాలా రోజుల నుండి చూస్తున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు పట్టాలెక్కలేదు.

దీంతో ఈ సినిమా ఉందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది. అయితే ఈ సినిమా ఖచ్చితంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ స్వర్గం సెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ స్వర్గం సెట్‌ను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారట. ఇక ఈ సినిమాలో రంభ పాత్రలో బిగ్‌బాస్ ఫేం బ్యూటీ మోనల్ గజ్జర్ నటిస్తోండగా, అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టిలు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా నాగ్ సరసన తొలిభాగంలో నటించిన సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కూడా నటిస్తుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి సమయంలో పారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. మరి బంగార్రాజు చిత్రంతో నాగ్ అనుకున్న విజయాన్ని అందుకుంటాడో లేడో చూడాలి.