నిపుణులు వారు కాదు.. వీరు అసలైన నిపుణులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. అరె.. అధికారంలో ఉంటే ఏమైనా చేస్తారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే.. అవకాశముంటే చేసేస్తాం అన్నట్టుంది వైసీపీ తీరు. కాలుష్య నియంత్రణ మండలిలో అధికారేతర నిపుణులుగా సభ్యులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ వారిని తొలగించి వైసీపీ సభ్యులకు చోటు కల్పించింది ప్రభుత్వం. వారిని తొలగించడానికి కూడా ఓ కారణం చెప్పింది. గతంలో నియమితులైన ముగ్గురు సభ్యులకు నైపుణ్యం లేదు.. వారు నిపుణులు కాదు.. అందుకే వారి స్థానంలో వీరిని నియమిస్తున్నాం అని చెప్పుకొచ్చింది. కాలుష్య నియంత్రణ మండలిని పునర్ నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం చర్యలు తీసుకొంది. నాన్ అఫీషియల్ సభ్యులుగా గతంలో (టీడీపీ తరపున) పరుచూరి క్రిష్ణ, డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, జి. ఆదెన్నలను గత ఏడాది తొలగించింది. వారి పదవీ కాలం ఇంకా ముగియకముందే వారికి టెక్నికల్ కాంట్రిబ్యూషన్ లేదని సాగనంపింది. ఏమో.. వారికి ప్రభుత్వం ఏ టెస్టు పెట్టిందో.. ఆ పరీక్షలో వారు పాస్ కాలేదేమో.. ప్రశ్నలు కఠినంగా ఇచ్చారేమో అని టీడీపీ నాయకులు భావించారు. అయితే ఇటీవల వైసీపీకి చెందిన ముగ్గురిని నియమించింది. కడప జిల్లా వేముల మండలానికి చెందిన మరకా శివక్రిష్ణారెడ్డి (వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి), ప్రకాశం జిల్లాకు చెందిన వెన్న హనుమంతరెడ్డి (వైసీపీ రాష్ట్ర కార్యదర్శి),చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన డాక్టర్ సునీల్ కుమార్ (వైసీపీ నేత)లను నియమించింది. ఈ ముగ్గరూ ఇక కాలుష్య నియంత్రణ మండలిలో సభ్యులుగా అధికారికంగా కొనసాగుతారు. కాలుష్యంపై వీరికి ఉన్న అవగాహన ఏంటి అనేది ప్రభుత్వానికి మాత్రమే తెలుస్తుంది.. ఎందుకంటే వారిని నియమించింది వారి గవర్నమెంటే కాబట్టి.. వారిని తొలగించాలని టీడీపీ కోరినా.. వారి టాలెంటను ప్రశ్నించినా టీడీపీకి సమాధానం ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకంటే ఇది వారి సర్కారు కాదు.. టీడీపీ కూడా అడగదు. వారున్నపుడు వారిష్టం.. వీరున్నపుడు వీరిష్టం.. అంతేకదా.. ఓ సామెత కూడా ఉంది కదా.. వడ్డించే వాడు మనవాడే అయితే మనం చివరి బంతిలో ఉన్నా మనకు వచ్చేది వస్తుందని.. అంతే.. ! రాజకీయమంటే అంతేనమ్మా.. !