బుర్ర ఉంటేనే సినిమా చూడాలంటోన్న హీరోయిన్!

ఒక సినిమా తీసేందుకు ఆ చిత్ర యూనిట్ ఎంత కష్టపడుతుందో అందరికీ తెలిసిందే. సినిమా ప్రీప్రొడక్షన్ పనుల నుండి మొదలుకొని, షూటింగ్ కంప్లీట్ చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి థియేటర్లలో రిలీజ్ అయ్యే వరకు ఆ చిత్ర యూనిట్ టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఇక తమ సినిమాను వీలైనంత ఎక్కువగా ప్రమోట్ చేస్తే జనంలోకి వెళ్లి, వారు సినిమాను చూస్తే తమ సినిమా హిట్ అవుతుందని వారు చేయని ప్రయత్నాలు ఉండవు. కానీ రిలీజ్‌కు రెడీ అయిన ఓ సినిమా గురించి అందులో నటించిన హీరోయిన్ పుసుక్కున నోరు జారడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

వైవిధ్య చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్ డేట్‌ను కూడా ఫైనల్ చేసుకుంది. ఈ సినిమాలో అందాల భామ సునైనా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త కాంట్రోవర్సీ క్రియేట్ చేసేలా ఉన్నాయని అంటున్నారు ఆ కామెంట్స్ విన్నవారు. రాజ రాజ చోర రొటీన్ సినిమా కాదని, ఈ సినిమా కాన్సెప్ట్ అర్థం కావాలంటే మైండ్ పెట్టి చూడాలని, ఊరికే సినిమా చూశామా అన్నట్లు చూస్తే ఈ సినిమా అస్సలు అర్థం కాదని అమ్మడు చెప్పుకొచ్చింది.

అంటే తెలుగు ఆడియెన్స్ సినిమాలను కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే చూస్తారా, వారికి సినిమాలోని కంటెంట్‌తో పని లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సినిమాలో లోతైన కంటెంట్ ఉన్న చిత్రాలకు తెలుగు ఆడియెన్స్ ఎప్పుడు పట్టం కడుతూ వచ్చారని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇలా సినిమా ప్రమోషన్స్ కోసం ఏదిపడితే అది మాట్లాడటం సరికాదని హీరోయిన్ సునైనాకు చురకలు పెడుతున్నారు సినీ క్రిటిక్స్. ఏదేమైనా సినిమా ప్రమోషన్స్‌లో ఎంత ఆలోచించి మాట్లాడితే అంత మంచిదని పలువురు అంటున్నారు.

Share post:

Popular