ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు? అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఐపీఎస్ అధికారిగా, తెలంగాణలో గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అట్టహాసంగా బీఎస్పీ పార్టలో చేరారు. ఆయన పార్టీ కండువా ఇలా కప్పుకున్నారో లేదో.. రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. దీంతో ఆర్ఎస్పీ (ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్) పొలిటికల్ కెరీర్ మొదలైనట్లే. పార్టీలో చేరిన సందర్భంగా ఆర్ఎస్పీ చేసిన ప్రసంగం ఆలోచించేలా ఉంది. దళితులకు కావాల్సింది దళిత బంధు కాదు.. అధికారం అన్నట్లు ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని అన్ని పార్టీల నాయకులు కూడా ఆసక్తిగా విన్నారు.

6 లక్షల మంది దళిత విద్యార్థుల కోసం గురుకులాలు స్థాపించారని, మిగతా వారి పరిస్థితేమిటని ప్రశ్నించారు. గురుకులాల కార్యదర్శిగా దళితుల అభివ్రుద్ది గురించి ఆలోచిస్తే.. చేతులు కట్టేశారని వాపోయారు. అందుకే ఇలా అయితే కాదు.. రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయి సమాజం కోసం పనిచేద్దామని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ కు వెళదామని పరోక్షంగా సీఎం కేసీఆర్ నే టార్గెట్ చేశారు. బీఎస్పీలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిన ఆర్ఎస్పీ తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటో చెప్పలేదెందుకని ఇతర పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

రాజకీయాలను, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకొని దళిత నేతలతో చర్చలు జరిపి బీఎస్పీ తరఫున తెలంగాణలో చక్రం తిప్పడానికి ఆర్ఎస్పీ సన్నద్ధమవుతున్నారని తెలిసింది. అసలు ఆయన బీఎస్పీలో చేరడానికి కూడా ఓ కారణముంది. రాష్ట్రంలో బీఎస్పీకి ఓటు బ్యాంకు ఉండటం, కాన్షీరామ్ స్థాపించిన పార్టీ కావడం వల్లేనని తెలిసింది. అంతేకాక.. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 2019లో ఇబ్రహీంపట్నం నుంచి పోటీచేసిన మల్ రెడ్డి రంగారెడ్డి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. కొత్తగా పార్టీ పెట్టి పునాదులు వేసి బలోపేతం చేయాలంటే చాలా సమయం పడుతుంది. అంతలోపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తాయి.. అందుకే బీఎస్పీ కండువా కప్పుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.