కార్య‌క‌ర్త చెంప మీద కొట్టిన పీసీసీ అధ్యక్షుడు..!

మనం ఎవరిని అయిన అభిమానించామంటే వాళ్ళతో ఫోటో దిగాలని, వాళ్ళ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటాము కదా. ఉదాహరణకి సినీ హీరోలు, హీరోయిన్స్, రాజకీయ నాయకులు ఇలా మనం అభిమానించే వ్యక్తితో ఫోటో దిగాలంటే అది సాధ్యమైనంత పని కాదు. ఎందుకంటే మనం అభిమానించే వ్యక్తి మనకి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే ఆ కోరిక నెరవేరుతుంది. అయితే ఈ క్రమంలోనే ఓ కార్యకర్త తాను ఎంతగానో అభిమానించే ఒక రాజకీయ వేత్తతో ఒక సెల్ఫీ దిగడానికి ప్రయత్నం చేసాడు. అయితే ఆ రాజకీయ వేత్త మాత్రం తాను పదవిలో ఉన్నా అనే విషయాన్ని మరిచిపోయి కోపంతో ఆ కార్యకర్త చెంప పగలుకొట్టాడు. ఈ ఘటనకి సంబందించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ వివరాల్లోకి ఒకసారి వెళితే.. కర్నాటక రాష్ట్రా పీసీసీ అధ్యక్షుడుగా పదవిలో ఉన్న డీకే శివకుమార్‌ మాండ్యలో ఉన్న ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత మద్దెగౌడను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయనతో పాటు అక్కడికి వచ్చిన కార్యకర్తల్లో ఒకరు ఆయన భుజం మీద చెయ్యి వేసి ఫోటో తీసుకునేందుకు ప్రయత్నించడంతో కోపంతో ఊగిపోయాడు డీకే శివకుమార్‌. ఆ కార్యకర్తను కొట్టడమే కాకుండా, హద్దుమీరి ప్రవర్తించాడని ఆ కార్యకర్తపై మండిపడ్డాడు డీకే శివకుమార్‌.

ఈ ఘటనపై బీజేపీ నేతలుడీకే శివకుమార్‌ కు కార్యకర్తలు అంటే చాలా చులకన అని విమర్శించారు.ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పదవిలో ఉండి ఇలా ప్రవర్తించడం సరికాదు అని పేర్కొన్నారు బీజేపీ కార్యకర్తలు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డీకే శివకుమార్ స్పందించి భౌతికదూరం పాటించకపోవడంతోనే కార్యకర్తను మందలించానని వివరణ ఇచ్చారు. అలాగే ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయవద్దని కోరారు. కానీ నెటిజన్లు మాత్రం తీవ్ర స్థాయిలో ఈ వీడియోను ట్రోలింగ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఎంత రాజకీయ వేత్త అయితే ఇలా కొట్టడం సరికాదు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.