సంతోష్ శోభన్ హీరోగా సినిమా టైటిల్ ఖరారు..!

టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త హీరోల జోరు నడుస్తుంది. డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కామెడీ ఎంటర్టైనర్లు, ఫ్యామిలీ జోనర్ సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. ఆ కోవకు చెందిన హీరోనే సంతోష్ శోభన్. ప్రస్తుతం ఈయన హీరోగా సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న చిత్రానికి ‘ప్రేమ్ కుమార్’ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంతో అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో రాశీ సింగ్ హీరోయిన్. కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, మధు ఇతర తారాగణం. ఈ సినిమా దాదాపుగా 80 శాతం చిత్రీకరణ పూర్తయింది.

లాక్‌డౌన్ తర్వాత మిగతా భాగం పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నేడు ఈ సినిమాను ప్రకటించడంతో పాటు టైటిల్ వెల్లడించారు. దర్శకుడు అభిషేక్ మహర్షి ఈ సందర్భంగా మాట్లాడారు. సాధారణంగా తెలుగు సినిమా పతాక సన్నివేశాల్లో హీరో వచ్చి స్పీచ్‌లు ఇచ్చి హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాడు. కానీ, అదే పెళ్లి పీటలు మీద ఉన్న పెళ్లికొడుకును మాత్రం ఎవరూ పట్టించుకోరు. అటువంటి ఓ పెళ్లికొడుకు తనకు పెళ్లి అవ్వడం లేదనే ఫ్రస్ట్రేషన్‌లో ఏం చేశాడనేది సినిమా కథ అని చిత్ర విశేషాలను మీడియాకు తెలిపారు.