ఒక్క వైన్‌బాటిల్ ధ‌ర రూ.7కోట్లు..!

సాధార‌ణ లిక్క‌ర్ తో పోల్చితే వైన్ ధ‌ర కాస్తా ఎక్కువ‌గానే ఉంటుంది. వైన్ ఎంత పురాత‌న‌మైన‌ది అయితే అంత కిక్కుతోపాటు, అంతే ఎక్కువ ధ‌ర ప‌లుకుతుంటుంది. అందుకే పాత వైన్ కోసం మ‌ద్యం ప్రియులు వేలు, కాదు లక్షల రూపాయాల‌నైనా వెచ్చిస్తారు. వాటన్నింటిని తలదన్నే విధంగా ఓ మద్యం బాటిల్‌ విలువ కోట్ల రూపాయల ధ‌ర ప‌లుకుతుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. అంత ధర ఎందుకంటే అది అంతరిక్షంలో పులియబెట్టిన వైన్ కావ‌డ‌మే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఏడాదికిపైగా గడిపిన ఒక ఫ్రెంచ్‌ వైన్‌ బాటిల్‌ను క్రిస్టీస్‌ సంస్థ వేలానికి పెట్టింది. ఇది 10 లక్షల డాలర్లు (దాదాపు రూ.7.37 కోట్లు) పలకొచ్చని వారు భావిస్తున్నారు.

ఇక ఆ వైన్ సీసా పేరు ‘పెట్రస్‌ 2000’. 2019 నవంబరులో అంతరిక్షంలోకి పంపిన 12 వైన్‌ సీసాల్లో ఇది ఒకటి. భూమికి వెలుపల సేద్యానికి అవకాశాలపై పరిశోధనలో భాగంగా ప్రైవేటు అంకుర పరిశ్రమ ‘స్పేస్‌ కార్గో అన్‌లిమిటెడ్‌’ వాటిని అక్కడికి పంపింది. 14 నెలల తర్వాత వాటిని భూమికి రప్పించింది. ఫ్రాన్స్‌లోని బోర్డోలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వైన్‌ అండ్‌ వైన్‌ రీసెర్చ్‌లో పరిశోధకులు ఆ వైన్ రుచికి పరీక్షలు కూడా నిర్వహించారు. భూమిపై అంతేకాలం పాటు పులియబెట్టిన వైన్‌తో దీన్ని పోల్చి చూడగా రుచిలో రెండింటి మధ్య వైరుధ్యం ఉందని గుర్తించారు. అంతేకాదు రోద‌లోకి వెళ్లొచ్చిన పానీయం మృదువుగా, సువాసనభరితంగా ఉందని, అంతరిక్షంలో కొన్నాళ్లు ప్రత్యేక వాతావరణంలో ఉన్న ఈ వైన్‌ ‘పరిపక్వానికి’ వచ్చిందని క్రిస్టీస్‌ వైన్‌ అండ్‌ స్పిరిట్స్‌ విభాగం డైరెక్టర్‌ టిమ్‌ టిప్‌ట్రీ తెలిపారు. ప్రస్తుతం ఈ సీసా ధర పెరిగిపోయిందని చెప్తున్నారు.