తమిళనాడు ఫ్యాక్టరీలో ప్రమాదం

దేశంలో ఓ వైపు కరోనాకేసులు పెరుగుతుంటే మరో వైపు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల చాలా మందే ప్రాణాలను కోల్పోతున్నారు. నేడు తమిళనాడులోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. కడలూర్‌ నుంచి చిదంబరం వెళ్లే మార్గంలో ఉన్న చిప్‌కార్డ్ కాంప్లెక్స్‌లో 30కి పైగా ప్రైవేట్ కర్మాగారాలు పనిచేస్తున్నాయి. వీటిలో ఓ పురుగుమందుల కంపెనీలో గురువారం ఉదయం మంటలంటుకున్నాయి. ఫ్యాక్టరీలోని ఒక మెషిన్ సడెన్‌గా పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. దాంతో ఫ్యాక్టరీ అంతా మంటలు వ్యాపించి.. దట్టమైన పొగ ఏర్పడింది.

 

ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది అక్కడే చిక్కుకుపోయారు. యాజమాన్యం సమాచారంతో అగ్నిమాపక విభాగం సంఘటన స్థలానికి చేరుకుని లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చింది. కాగా.. ఈ మంటల్లో అప్పటికే నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని కడలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి, అగ్నిప్రమాదానికి గల కారణం గురించి దర్యాప్తు చేస్తున్నారు.