కరోనా ఎఫెక్ట్: సివిల్స్ పరీక్షలు వాయిదా..?

దేశంలో కరోనా కేసలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. వైద్య సదుపాయాల స్థితి కూడా సరిగా లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ వాయిదా పడింది. ఈ విషయాన్ని యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్‌సీ) గురువారం వెల్లడించింది.

కరోనా విజృంభణ నేప‌థ్యంలో జూన్‌లో జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌రు 10కి వాయిదా వేసింది. ఐఏఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐపీఎస్‌తో పాటు ఇత‌ర కేంద్ర స‌ర్వీసుల‌కు యూపీఎస్‌సీ సివిల్స్ ప్రిలిమిన‌రీ, మెయిన్స్‌, ఇంట‌ర్వ్యూ మూడు ద‌శ‌ల్లో ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే. కాగా 27 జూన్‌,2021న జ‌ర‌గాల్సిన ప్రిలిమ్స్‌ను కరోనా కారణంగా యూపీఎస్‌సీ వాయిదా వేసింది. ఈ ప‌రీక్ష‌ను 10 అక్టోబ‌రు, 2021న నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. విద్యార్థులు, పరీక్షలు రాసేవారు జాగ్రత్తగా ఉండాలని, పరీక్షలకు ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవ్వాలని సూచించింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే పరీక్షలు అనుకున్న ప్రకారమే జరుగతాయి. కరోనా వల్లనే పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.