గుడ్లు పెట్ట‌ని కోళ్లు.. పోలీసుల‌కు యాజ‌మాని ఫిర్యాదు..!

కోళ్లు గుడ్లు పెట్ట‌క‌పోవ‌డం ఏమిటీ? ఈ విష‌య‌మై యాజ‌మానికి ఏకంగా పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డం ఏమిటీ? విన‌డానికి విడ్డూరంగా ఉంది క‌దూ. అయినా మీరు చ‌దివింది నిజ‌మే. కొన్ని సార్లు పోలీసులకు ఇలాంటి విచిత్రమైన సంఘటనలు అనుభ‌వంలోకి వ‌స్తుంటాయి. మా ఇంట్లో పిల్లి తప్పిపోయింది. మా మేక ఎటో వెళ్ళిపోయింది వెతికి పెట్టండి అంటూ కొంద‌రు కేసులు పెట్టిన ఉదంతాలున్నాయి. అయితే ఇది అంత‌గా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. కొట్టిపారేయ‌డానికీ వీలు లేదు. ఆ కోళ్లు, గుడ్లు పెట్టకపోవ‌డానికి పెద్ద కార‌ణ‌మే ఉంది. వివ‌రాల్లోకి వెళ్లితే..

మహారాష్ట్ర పూణె జిల్లాలో పౌల్ట్రీ ఫార్మ్ లు ఎక్కువగా ఉంటాయి. అక్కడ నుంచి నిత్యం పెద్ద సంఖ్య‌లో గుడ్లు సరఫరా ఎక్కువగా సాగుతు ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా పౌల్ట్రీ లోని కోళ్లు, గుడ్లు పెట్టడం మానేశాయి. దీంతో స‌ర‌ఫ‌రా త‌గ్గిపోయింది. మ‌రోవైపు అస‌లు ఉన్న‌ట్టుండి కోళ్లు గుడ్లు ఎందుకు పెట్టడం లేదో తెలియని యజమానులు ఆందోళన చెందారు. తుద‌కు కోళ్లకు అందిస్తున్న దాణానే అని అనుమానించారు. వెంటనే పౌల్ట్రీ యజమానులందరూ కలిసి పూణెలోని లాల్ భోర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని ఒక కంపెనీ నుంచి కోళ్ల దాణాను కొనుగోలు చేసి కొన్ని రోజులుగా తమ కోళ్లకు అందిస్తున్నామ‌ని, ఆ దాణా తిన్న తర్వాత నుంచి కోళ్లు, గుడ్లు పెట్టడం మానేశాయని వివ‌రించారు. సదరు దాణా కంపెనీ మీద కేసు నమోదు చేయాలనీ కోర‌గా, పోలీసులు కేసు నమోదు చేసి సదురు కంపెనీ పై విచారణ చేపట్టారు.