లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ‌.. క‌డియాల కోసం ఘాతుకం..

పిల్ల‌ల‌కు పెళ్లిలు చేసి మ‌న‌వ‌లు, మ‌న‌వ‌రాళ్ల‌తో కాల‌క్షేపం చేయాల్సిన వ‌య‌స్సులో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడు. అది అలా ఉంచితే త‌న ప్రేయ‌సికి కాళ్ల క‌డియాల‌ను ఇచ్చేందుకు మ‌రో మ‌హిళ‌ను హ‌త్య చేశాడు. అనంత‌రం గుర్తు తెలియ‌కుండా ఆమెను ద‌హ‌నం చేసి అక్క‌డి నుంచి జారుకున్నారు. ఈ సంఘ‌ట‌న మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ పట్టణ శివారులో ఇటీవ‌ల వెలుగుచూసింది. పోలీసుల విచార‌ణ‌లో విస్తుపోయే అనేక నిజాలు వెలుగు చూశాయి. అధికారులు వెల్ల‌డించిన క‌థ‌నం ప్ర‌కారం.. గద్వాల జిల్లా అయిజకు చెందిన ఆలె విష్ణు(51), మక్తల్ సమీపంలోని ఓ పొలాన్ని మూడేళ్ల నుంచి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పంచదేవ్‌పహాడ్ గ్రామానికి చెందిన అంజిలమ్మ(45)తో ఆయ‌న‌కు పరిచయం ఏర్పడింది. అంజిలమ్మ భర్త చనిపోగా విష్ణుతో సహజీవనం చేస్తున్న‌ది. ఇదిలా ఉండ‌గా గ‌తేడాది పంట సాగుకు పెట్టుబడి కోసం డబ్బుల్లేకపోవ‌డంతో అంజిలమ్మ కాళ్ల కడియాలను అమ్మి విష్ణు పెట్టుబడి పెట్టాడు. ఆశించిన స్థాయిలో దిగుబ‌డి రాక‌పోవ‌డంతో పంట నష్టపోయి పెట్టుబడి కూడా తిరిగి రాలేదు.

ఇదిలా ఉండ‌గా.. మ‌రోవైపు అంజిల‌మ్మ‌ తన కాళ్ల కడియాలు కావాలని విష్ణుపై ఒత్తిడి చేస్తూ వ‌స్తు‌న్న‌ది. అంజిలమ్మ కాళ్ల కడియాలు అడిగిన సందర్భంలో ఆమె సమీప బంధువైన చిట్యాల లింగమ్మ కాళ్లకు కడియాలు ఉన్న విషయాన్ని విష్ణు గమనించాడు. లింగమ్మను ఎలాగైనా హతమార్చి ఆమె కాళ్ల కడియాలను తీసుకొచ్చి అంజిలమ్మకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే.. మార్చి 28న మక్తల్‌కు వచ్చిన లింగమ్మతో కలిసి విష్ణు, అంజిలమ్మ మద్యం సేవించారు. భీమా కాల్వ పక్కకు తీసుకెళ్లి లింగమ్మ గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించారు. భయంతో లింగమ్మ కేకలు వేయడంతో విష్ణు తన వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడిచాడు. ఆ తర్వాత గొంతుపై పొడిచి హత్య చేశాడు. అనంత‌రం ఆమెను ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌కుండా ద‌హ‌నం చేసి వారిద్ద‌రూ అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. అంజిలమ్మ, విష్ణును అదుపులోకి తీసుకుని త‌మ‌దైన శైలీలో విచారించ‌గా కాళ్ల కడియాల కోసమే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.

Share post:

Latest