క‌రోనా పేషంట్‌.. అందులోనూ వృద్ధురాలు.. అయినా వ‌ద‌ల‌నీ కామాంధుడు..

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తీసుకొచ్చినా మృగాళ్లు మాత్రం మార‌డం లేదు. ఆడ‌బిడ్డ‌ల‌కు కండ్ల ప‌డితే చాలు మీద‌ప‌డేస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక‌డు కరోనా పేషంట్ అని కూడా భయపడకుండా అత్యాచారానికి య‌త్నించాడు. వృద్ధురాలు అని కూడా చూడ‌కుండా బ‌రితెగించాడు. ఈ సంఘ‌ట‌న మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. గ్వాలియర్‌కు చెందిన ఓ 59ఏళ్ల మ‌హిళ ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డింది. దీంతో చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న లోటస్ హాస్పిటల్‌లో చేరింది. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమెకు వెంటిలేటర్ సాయంతో వైద్యులు చికిత్సనందిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా విష‌మ పరిస్థితుల్లో ఉన్న ఆ ‌మహిళ చికిత్స పొందుతుండ‌గా వార్డుబాయ్ వివేక్ లోధి(25) ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించ‌డం మొద‌లుపెట్టాడు. దీంతో ఆ మహిళ వెంటనే భయంతో అలారం మోగించడంతో అక్కడి నుంచి వివేక్ పారిపోయాడు. జ‌రిగిన ఘోరాన్ని సదరు మహిళ కుటుంబీకులకు తెల‌ప‌డంతో వారు వైద్య‌శాల సిబ్బందికి, పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 376, 354 కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ ఘటన అనంత‌రం ఆ మ‌హిళ‌కు హాస్పిటల్ నిర్వాహ‌కులు ట్రీట్‌మెంట్ నిలిపివేయ‌డం కొస‌మెరుపు. లోధిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హాస్పిటల్ పరువు పోయిందని భావించిన యాజమాన్యం తమను ఇబ్బందులకు గురిచేస్తుందని, వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Share post:

Popular