ప్రైవేట్ ద‌వాఖాన నిర్వాకం.. బిల్లు క‌ట్ట‌లేద‌ని..

క‌రోనా మ‌హ‌మ్మారి ఒక‌వైపు విజృంభిస్తున్న‌ది. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటున్న‌ది. జ‌నం బ‌య‌ట అడుగుపెట్టాలంటేనే జంకుతున్నారు. ఇదే అదునుగా ప‌లు ప్రైవేట్ వైద్య‌శాల‌లు చెల‌రేగిపోతున్నాయి. మూలిగే న‌క్క మీద తాటికాయ ప‌డిన చందంగా ఇప్ప‌టికే కొవిడ్ కార‌ణంగా ఉపాధి, ఉద్యోగాల‌ను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన ప‌రిస్థితుల్లోనూ జ‌నాల ర‌క్తాన్ని పీల్చుతున్నాయి. ట్రీట్‌మెంట్ పేరిట దోచుకుంటున్నాయి. ప్రైవేట్ ద‌వాఖాన‌ల దాష్టికానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌.

హైద‌రాబాద్‌లోని అల్వాల్ కి చెందిన రామారావు అనే పెద్దాయన ఇటీవ‌ల అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. దీంతో కుటుంబ స‌భ్యులు బేగం పేట విన్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ఆ స‌మ‌యంలోనే వారు త‌మ‌కు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంద‌ని, చేతిలో డ‌బ్బులు లేవ‌ని వెల్ల‌డించారు. అయితే ఏం ఫ‌ర్వాలేదు. ఇన్సూరెన్స్ సౌక‌ర్యం మా వ‌ద్ద ఉంద‌ని చెప్పిన నిర్వాహ‌కులు వారిని వైద్య‌శాల‌లో చేర్పించుకున్నారు. ట్రీట్‌మెంట్ అందించారు. అందుకు మొత్తంగా రూ.4ల‌క్ష‌ల బిల్లును వేశారు. అయితే ఇక్క‌డే అస‌లు ట్విస్టు ఉంది. ఇన్సూరెన్స్ రావ‌ట్లేద‌ని, మొత్తం డ‌బ్బుల‌ను చెల్లించాల‌ని బిల్లు చేతిలో పెట్ట‌డంతో ఆ కుటుంబ స‌భ్యులు కంగుతిన్నారు. హాస్పిట‌ల్ నిర్వాహ‌కులు అక్క‌డితో ఆగ‌కుండా బిల్లు క‌ట్ట‌లేద‌ని ఆ పెద్దాయ‌న‌ను ఏకంగా స్టోర్ రూమ్ లో బంధించారు. గత 20 రోజుల నుండి ఇదే పరిస్థితి. ఇదే విష‌య‌మై వారు హెల్త్ మినిష్టర్ కి కూడా కంప్లైంట్ చేయ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ ఎలాంటి ఫ‌లితం లేక‌పోవ‌డం ప్రైవేట్ ద‌వాఖాల బ‌రితెగింపున‌కు నిద‌ర్శ‌నం.