మంత్రి పరిటాల వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే

ఏపీలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి జిల్లాల్లో అనంత‌పురం ఒక‌టి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ రెండు ఎంపీ సీట్ల‌తో పాటు 12 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. త‌ర్వాత జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కూడా వార్ వ‌న్‌సైడే అయ్యింది. అలాంటి జిల్లాలో ఎంతో కాలంగా క‌లిసిఉన్న ఇద్ద‌రు కీల‌క నేత‌ల మ‌ధ్య ఇప్పుడు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. అనంతపురం జిల్లా పేరు చెపితేనే ప‌రిటాల ఫ్యామిలీ ముందుగా గుర్తుకు వ‌స్తుంది. ప‌రిటాల ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అలాంటిది.

జిల్లా నుంచి చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ప‌రిటాల సునీత‌కు ఇదే జిల్లా ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి ఇప్పుడు ఉప్పు నిప్పుగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఐసు ముక్కలేసినా అంటుకునేంత రేంజ్‌లో వైరం కొనసాగుతోందట. వీరిద్ద‌రి మ‌ధ్య వైరం ఎంత దూరం వెళ్లిదంటే  ఇటీవ‌ల ధర్మవరంలో సూరికి వ్యతిరేకంగా ఉన్న ఓ నాయకుడి ఇంట్లో శుభకార్యానికి సునీత తనయుడు శ్రీరామ్‌ 50 వాహనాల్లో వెళ్లారు. దీన్ని సూరి వ్యతిరేకించారు. అక్కడ ప్రారంభమైన గొడవ పెరిగి పెరిగి పెద్దదయ్యింది.

ధ‌ర్మ‌వ‌రంలో మంత్రి సునీత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా కూడా సూరి వ‌ర్గీయులు ఒప్పుకోవ‌డం లేదు. వీరిద్ద‌రి మ‌ధ్య వార్‌కు రీజ‌న్ ఏంటంటే వచ్చే ఎన్నిక‌ల్లో మంత్రి సునీత త‌న త‌న‌యుడు శ్రీరామ్‌ను పొలిటిక‌ల్ ఎంట్రీ చేయించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె ధ‌ర్మ‌వ‌రం మీద క‌న్నేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది సూరిలో కల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. సునీత‌కు చ‌నువిస్తే త‌న ఎమ్మెల్యే సీటుకు ఎక్క‌డ ముప్పువ‌స్తుందోన‌ని భావిస్తున్నాడు. అందుకే సునీత‌కు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అస్స‌లు ప్లేస్ లేకుండా చేస్తున్నాడు.

ఈ విష‌యంలో చంద్ర‌బాబు సైతం ఇన్వాల్వ్ అయ్యి సంయ‌మ‌నం పాటించాల‌ని చెప్పినా సునీత‌, సూరి మాత్రం త‌మ ప‌నితాము చేసుకుపోతున్నారు. ఇటీవ‌ల ఈ రెండు వ‌ర్గాల గొడ‌వ‌లో రెండుమూడుసార్లు 144 సెక్ష‌న్ పెట్టారంటే ఇక్క‌డ ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రి ఈ వార్ 2019 ఎన్నిక‌ల నాటికి ఎలా మారుతుందో చూడాలి. సునీత ఇక్క‌డ శ్రీరామ్‌కు టిక్కెట్టు ఇప్పించుకుంటుందా ?  లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే సూరే మ‌రోసారి బ‌రిలో ఉంటాడా ? అన్న‌ది చూడాలి.