16 ఏళ్ల కింద‌టే జ‌య వీలునామా…ఆస్తులు ఎవ‌రికి

త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం, అమ్మ జ‌య‌లలిత ఆస్తుల విష‌యంలో పెద్ద ఎత్తున ద‌క్షిణాదిరాష్ట్రాల్లో చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఆమె వంద‌ల కోట్లు కూడ‌బెట్టిన విష‌యం తెలిసింది. అదేస‌మ‌యంలో ఆమె వివాహం చేసుకోక‌పోవ‌డం, త‌న అనుకున్న వారిని ఎవ‌రినీ చేర‌దీయ‌క‌పోవ‌డం, ఓ కుమారుడిని ద‌త్త‌త తీసుకుని పెళ్లి చేసినా.. ఆ త‌ర్వాత అత‌నితో తెగ‌తెంపులు చేసుకోవ‌డం తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే అమ్మ కూడ‌బెట్టిన ఆస్తులు.. చెన్నైలోని పోయెస్‌గార్డెన్‌, హైద‌రాబాద్‌లోని జేజే గ‌ర్జెన్‌ల‌కు ఎవ‌రు వార‌సులు? ఈ మొత్తం ఆస్తుల‌ను ఎవ‌రికీ అప్ప‌గించ‌కుండానే అమ్మ కాలం చేసిందా? అనే సందేహం ప్ర‌తి ఒక్క‌రిలోనూ త‌లెత్తింది. ప‌త్రిక‌ల్లోనూ బోలెడు క‌థ‌నాలు వ‌చ్చాయి.

అంతేకాదు, ఇప్పుడు అమ్మ‌లేదు కాబ‌ట్టి.. ఆ ఆస్తుల‌న్నింటినీ జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ వాల్చేసుకుంటుంద‌ని, ఆమె, ఆమె ప‌రివారం అనుభ‌విస్తార‌ని అందరూ భావించారు. అయితే, ఈ భావ‌న‌లు, క‌థ‌నాలు త‌ప్ప‌ని తెలుస్తోంది. త‌న ఆస్తుల‌కు సంబంధించి జ‌య దాదాపు 16 ఏళ్ల కింద‌ట అంటే 2000 సంవ‌త్స‌రంలోనే అనేక జాగ్ర‌త్త‌ల‌తో విల్లు రాసేశార‌ని స‌మాచారం. త‌న‌కు వార‌సురాలిగా భావిస్తున్న వ్య‌క్తికి అమ్మ త‌న పూర్తి ఆస్తిని ఎక్క‌డిక‌క్క‌డే రిజిస్ట్రేష‌న్ కూడా చేయించార‌నే విష‌యం తాజాగా వెలుగు చూసింది. నిజానికి  సినీ ఫీల్డ్‌లో ఉన్న‌స‌మ‌యంలోనూ ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోనూ అనంతరం త‌మిళ‌నాడులో అధికారంలోకి  వ‌చ్చాక జ‌య ఆస్తులు వంద‌ల కోట్ల‌కు పెరిగాయ‌ని నిఘా వ‌ర్గాలు తెలిపాయి.

ఈ క్ర‌మంలోనే అమ్మ 2000 సంవ‌త్స‌రంలో త‌న ఆస్తుల‌ను రిజిస్రేష‌న్ చేయించార‌ట‌. అయితే, రిజిస్ట్రేష‌న్ చ‌ట్టాల్లోని నిబంధన ప్రకారం ఇత‌రులు ఎవ‌రికీ వెల్ల‌డించ‌డానికి వీలులేని ‘బుక్ 3’ మేర‌కు అమ్మ త‌న వీలునామాను రిజిస్ట‌ర్ చేయించింద‌ట‌. దీంతో ఈ స‌మాచారం ఆ వారసురాలు (లీగల్‌ హెయిర్‌)కి మినహా ఇతరులకు  తెలిసే అవ‌కాశం లేదు. అయినా.. తాజాగా అందిన స‌మాచారం మేర‌కు.. వీలునామాతోపాటు రెండు ట్రస్ట్‌లను కూడా జయ   2000 జూలై 14న రిజిస్ట్రేషన్‌ చేశారని తెలుస్తోంది. ఇదంతా హైదరాబాద్‌లోని జేజే గార్డెన్స్‌లో జరిగింది.

అప్ప‌ట్లో జయలలిత ప్రతిపక్షంలో ఉన్నారు. వీలునామా, ట్రస్ట్‌ల రిజిస్ట్రేషన్‌ను తమిళనాడు చిరునామాతో కాకుండా హైదరాబాద్‌(పేట్‌ బషీరాబాద్‌)లోని తన గార్డెన్స్‌ చిరునామాతో చేయించారు. ‘పురట్చి తలైవి బెస్ట్‌ చారిటబుల్‌ ట్రస్ట్, నమద్‌ ఎంజీఆర్‌ బెస్ట్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌’లను (డాక్యుమెంట్‌ నంబర్లు బుక్‌ 4లో 31, 32) రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ ట్రస్టుల నిర్వాహకులుగా జయలలిత తన పేరుతోపాటు తన నెచ్చెలి శశికళ, దినకరన్, భాస్కరన్, భువనేశ్వరి పేర్లను చేర్చారు. సో.. ఇలా.. జ‌య ముందుచూపుతో జ‌య త‌న వీలునామాను అప్ప‌ట్లోనే రాశార‌న్న‌మాట‌.!!