రెడ్ల‌కూ యాంటీ అవుతోన్న జ‌గ‌న్‌

పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు! ఈ రోజు జై కొట్టిన నోళ్లే రేపు విమ‌ర్శిస్తాయి. ఈ రోజు జెండా మోసిన చేతులే రేపు ఛీత్క‌రిస్తాయి! ఈ ప‌రిస్థితి రాజ‌కీయాల‌కు, రాజ‌కీయ నేత‌ల‌కు కొత్త‌కాదు. ఇలాంటి ప‌రిస్థితే.. ఏపీ విప‌క్ష నేత, వైకాపా అధినేత జ‌గ‌న్‌కి ఎదురుకానుంద‌నే టాక్ న‌డుస్తోంది. ఇంత వ‌ర‌కు త‌న‌కు నైతిక బ‌లంగా ఉన్న త‌న సొంత సామాజిక వ‌ర్గం రెడ్లే ఇప్పుడు త‌న‌ను విమ‌ర్శిస్తున్నార‌ని, త‌న‌ను వీడి వేరే పార్టీల్లోకి జంప్ చేసేందుకు సిద్ధం అవుతున్నార‌ని స‌మాచారం.

జ‌గ‌న్ వైఖ‌రిపై ఆయన అనుంగులుగా ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గం గుర్రుగా ఉంద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీకి వెన్ను ద‌న్నుగా ఉండాల్సిన రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు జ‌గ‌న్‌పై ఇప్పుడు ప‌రోక్షంలో ఫైరై పోతున్నార‌ట‌. అదికూడా సీమ ప్రాంతం స‌హా నెల్లూరులో వైకాపాకు బ‌లంగా ఉన్నార‌ని భావిస్తున్న నేత‌లు ఇప్పుడు జ‌గ‌న్‌కి ఝ‌ల‌క్ ఇచ్చేందుకు సిద్ధ‌మైపోయిన‌ట్టు తెలుస్తోంది. నెల్లూరు ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, చిత్తూరు జిల్లా పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిలు జ‌గ‌న్‌కి ఎంతో కావాల్సిన వారు. పొలిటిక‌ల్‌గా ఆయా జిల్లాల్లో వైకాపాకి దిక్కుమొక్కు వాళ్లే.

అయితే, ఈ మ‌ధ్య జ‌గ‌న్ వైఖ‌రి ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌ల‌ను తీవ్రంగా క‌లిచి వేస్తోంద‌నే స‌మాచారం ఉంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో వైకాపా ఎంపీల‌తో రాజీనామా చేయిస్తాన‌ని జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌క‌టించ‌డంపై మేక‌పాటి ఆగ్ర‌హంగా ఉన్నారు. క‌నీసం త‌మ‌తో సంప్ర‌దించ‌కుండానే ఇంత పెద్ద నిర్ణ‌యం ఎలా తీసుకుంటార‌ని ఆయ‌న లోలోనే ఫైరైపోతున్నారు. గ‌తంలోనూ ఒక‌టి రెండు విష‌యాల్లో అభిప్రాయ భేదాలున్నాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న కుమారుడు గౌతం రెడ్డి, సోద‌రుడు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డితో క‌లిసి టీడీపీలోకి వెళ్లిపోతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక‌, జ‌గ‌న్‌కి అత్యంత స‌న్నిహితుడు అయిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మ‌రో విష‌యంలో ఫీలైపోతున్నారు. మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్ రెడ్డికి ఈయ‌న‌కు .ప‌చ్చ‌గ‌డ్డి వేసిన భ‌గ్గుమంటుంది. ఈ క్ర‌మంలో కిర‌ణ్‌ని జ‌గ‌న్ త‌న పార్టీలోకి చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న నేప‌త్యంలో పెద్దిరెడ్డి సైలెంట్‌గా త‌న దారి తాను చూసుకుంటున్నార‌ని స‌మాచారం. ఆయ‌న‌తో పాటు ఆయ‌న కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కూడా జ‌గ‌న్‌కు బై చెపుతార‌ని స‌మాచారం. ఇదే జ‌రిగితే.. రెడ్డి సామాజిక వ‌ర్గం జ‌గ‌న్‌ను ఒంట‌రిని చేసిన‌ట్టేన‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఏం జ‌రుగుతుందో చూడాలి.