డిపాజిట్ స్ట్రైక్స్‌తో మ‌రో షాక్ ఇచ్చిన మోడీ

బ్లాక్ మ‌నీకి బంప‌ర్ స్ట్రోక్ ఇచ్చిన ప్ర‌ధాని మోడీ..కి ఒక వ‌ర్గం ప్ర‌జ‌లు జై కొడుతుండ‌గా.. మ‌రో మేధావి వ‌ర్గం మాత్రం ఆ.. ఈ నిర్ణ‌యంతో బ్లాక్ మ‌నీ ఆగిపోతుందా.. నోట్ల రంగు మార్చుకుంటుంది అంతే! అని పెద‌వి విరిచారు. అయితే, ఇలాంటి వాళ్ల పెద‌వి విరుపుల‌కు కూడా షాకిచ్చే నిర్ణ‌యం తాజాగా వెలువ‌డింది. త‌మ వ‌ద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్ల‌ను బ్యాంకుల్లో మార్చుకునే వెసులుబాటు ఉన్న నేప‌థ్యంలో న‌ల్ల కుబేరులు త‌మ వ‌ద్ద ఉన్న సొమ్మును ఏదో ర‌కంగా డిసెంబ‌రు 30లోపు మార్చేసుకుందామ‌ని ప్లాన్ వేశారు.

 

అయితే, కేంద్రం ఇలాంటివారికి పెద్ద ఎత్తున చెక్ పెట్టాల‌ని నిర్ణయింది. మ‌నీ డిపాజిట్‌కి ప‌రిమితి లేద‌ని ప్ర‌క‌టించిన కేంద్రం తాజాగా ఓ వ్య‌క్తి గ‌రిష్టంగా ఎంతైనా డ‌బ్బు డిపాజిట్ చేసుకోవ‌చ్చ‌ని, అయితే, ఆదాయ పన్ను ప‌రిమితి చ‌ట్టాల‌కి లోబ‌డే చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. దీని ప్ర‌కారం రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో డ‌బ్బును బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జ‌మ చేయ‌డం అంత వీజీకాద‌న్న‌మాట‌! రెండున్న‌ర ల‌క్ష‌ల సొమ్ము దాటితే.. ఖ‌చ్చితంగా వారు ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చేస్తార‌ని, ఈ క్ర‌మంలో వారు రిటర్నుల్లో సమర్పించిన ఆదాయ వివరాలతో సరిపోలకపోతే 200 శాతం జరిమానా మోత మొగిపోతుంద‌ని స్పష్టంచేసింది.

 

‘ఈ ఏడాది నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే అన్ని ఖాతాల డిపాజిట్ల వివరాలు తెప్పించుకుంటాం.  వీటిని డిపాజిటర్లు సమర్పించిన ఆదాయ రిటర్నులతో పోల్చిచూస్తాం. తేడాలుంటే దానికి తగినట్లు చర్యలు తప్పవు’ అని రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ అధియా బుధవారం రాత్రి చెప్పారు. ఖాతాదారుడు సమర్పించిన వివరాలు సరిపోలకపోతే దాన్ని పన్ను ఎగవేతగా పరిగణిస్తారన్నారు. అప్పుడు ఆదాయపు పన్ను చట్టం 270 (ఎ) కింద 200 శాతం పెనాల్టీ విధిస్తామని ఆయన చెప్పారు. ఈ ప‌రిణామం నిజంగానే మ‌నీ మేట్ల గాళ్ల‌కి కంటిపై కునుకు క‌రువు చేసేదే!! దీనివ‌ల్ల.. సుమారు ఓ 50 ల‌క్ష‌లు క్యాష్ రూపంలో ఉన్న వ్య‌క్తి నానా తిప్ప‌లు ప‌డాలి. మ‌రి మోడీ నా మ‌జాకా!!