చాప‌కింద నీరులా ప‌వ‌న్ పోరాటం

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలోని తుందుర్రు త‌దిత‌ర గ్రామాల్లో భారీస్థాయ‌లో నిర్మిస్తున్న ఆక్వా ప‌రిశ్ర‌మ‌పై అక్క‌డి రైతులు, రైతు కుటుంబాల స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న పోరాటాన్ని మ‌రింత విస్తృతం చేస్తున్నారా? ఎలాంటి చ‌డీ చ‌ప్పుడు, ఆర్భాటం లేకుండానే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై బాధితుల ప‌క్షాన పోరాటం చేసేందుకు రెడీ అయ్యారా? ఈ క్ర‌మంలో పెద్ద ఎత్తున కార్యాచ‌ర‌ణ కూడా న‌డుస్తోందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఆక్వా ప‌రిశ్ర‌మ ప్రాంత బాధితుల‌తో హైద‌రాబాద్‌లో మీటింగ్ పెట్టి నాలుగు కామెంట్లు చేసి వ‌దిలేయ‌కుండా.. దీనిపై క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న చేసి.. వాస్త‌వ ప‌రిస్థితులు తెలుసుకుని, బాధితుల‌కు న్యాయం చేయాల‌ని ప‌వ‌న్ ప‌క్కా స్కెచ్‌తో దూకుడు మీద ఉన్నాడు.

ప‌శ్చిమ‌లో ఏర్పాటు చేస్తున్న ఆక్వా ప‌రిశ్ర‌మను అక్క‌డి రైతులు వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ ద‌గ్గ‌ర నుంచి భూములు తీసుకునేట‌ప్పుడు చెప్పిన కార‌ణం వేర‌ని, ఇప్పుడు మాత్రం ఆక్వా ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేస్తున్నార‌ని రైతులు పేర్కొంటున్నారు. ఈ ప‌రిశ్ర‌మ వ‌ల్ల వ్య‌ర్థ జ‌లాల‌తో స్థానిక నీరు క‌లుషితం అయి.. పోలాలు నాశనం అయిపోతాయ‌ని, ఈ ప‌రిశ్ర‌మ‌తో ప‌చ్చ పొలాలు బీళ్ల మాదిరిగా త‌యార‌వుతునాయ‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, దీనిపై త‌మ మాట‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఎదురు త‌మ‌పై కేసులు కూడా న‌మోదు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.

ఈ క్ర‌మంలో వారు త‌మ‌ను ఆదుకునే నేత కోసం వెతికారు. దీంతో వారికి జ‌న‌సేనాని క‌నిపించ‌డంతో త‌మ బాధ‌ను వెళ్ల‌బోసుకున్నారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లోని ప‌బ్లిక్ గార్డెన్ బాధితులు, మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన ప‌వ‌న్‌.. ప‌రిశ్ర‌మ‌ల‌కు తాను వ్య‌తిరేకం కాద‌ని, అయితే, మెజారిటీ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొవాల‌ని సూచించారు. తుందుర్రును మ‌రో నందిగ్రామ్ చేయొద్ద‌న్నారు. అస‌లు 144 సెక్ష‌న్ పెట్టాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో వెంట‌నే స్పందించి సీఎం చంద్ర‌బాబు అక్క‌డి ప‌రిస్థితులు తెలుసుకున్నారు.

అయితే, ప‌రిశ్ర‌మ నిర్మాణం యుద్ధ ప్రాతిప‌దిక‌న సాగుతోంది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ త‌న పోరాటాన్ని మ‌రింత పెంచాల‌ని నిర్ణ‌యించాడు.  ఆక్వా నిర్మాణ ప్రాంతంలో ప‌వ‌న్ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించ‌నున్నారు. దీనికిగాను జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అక్క‌డికి వెళ్లి బాధితుల‌తో ముఖాముఖి అయిన‌ట్టు తెలిసింది. భాధితులతో మాట్లాడే సందర్భంగానే బీమవరంలో పవన్ పర్యటించ‌డంపై వారికి వివ‌రించిన‌ట్టు తెలిసింది.  తద్వారా పవన్ పర్యటనకు గ్రౌండ్ సిద్ధం చేయనున్నట్లు జనసేన వర్గాలు వివరిస్తున్నాయి. దీంతో ఆక్వా ప‌రిశ్ర‌మ‌పై ప‌వ‌న్ పోరు ఆగ‌ద‌ని.. చాప‌కింద నీరులా పోరాటం ఉధ్రుతం అవుతోంద‌ని తెలుస్తోంది.