2019 కోసం వాళ్ల‌ను టార్గెట్ చేస్తోన్న జ‌గ‌న్‌

 గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు..  ఇక త‌మ పార్టీ అధికారంలోకి రావ‌డ‌మే త‌రువాయి అన్నంతగా మితిమీరిన విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ఫ‌లితాలు వెలువ‌డ్డాక ఆ షాక్‌నుంచి చాన్నాళ్లు కోలుకోలేద‌నే చెప్పాలి. అయితే అధికార పీఠం చేరుకోవాలంటే.. ప్ర‌జ‌ల్లో త‌న‌పై మ‌రింత విశ్వాసం పెంచుకోవాల‌న్న వాస్త‌వ‌ ప‌రిస్థితి గ్ర‌హించాక అధికార ప‌క్షంపై ఆయ‌న ఒక‌రకంగా యుద్ధ‌మే చేస్తున్నారు. తండ్రిలాగే మ‌డ‌మ తిప్ప‌ని నైజ‌మున్న జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి ప్ర‌తిప‌క్షంగా గ‌ట్టిగానే పోరాడుతున్నా.. రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోవ‌డం, వ్యూహ ర‌చ‌నా నైపుణ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు స‌రితూగ‌లేక‌పోతుండ‌టంతో ఆయ‌న‌కు అనుకున్నంత మైలేజీ రావ‌డం లేదు.

గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్టవ్రిభజన కార‌ణంగా… ఏపీలో నెలకొన్నఉద్వేగ‌ పరిస్థితుల దృష్ట్యా మెజారిటీ యువత  టీడీపీ, బీజేపీ కూటమికే ఓటు వేసింద‌ని, లేకుంటే అధికారం త‌మ‌నే వ‌రించేద‌ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గ‌ట్టిగానే అభిప్రాయ‌ప‌డుతున్నారు.  కేంద్ర, రాష్ట్రాలలో ఒకే కూటమి అధికారంలోకి వస్తే తమ భవిష్యత్తు బాగుంటుందన్న కారణంతో నాడు యువత ఎన్డీయే కూట‌మికి ఓట్లు వేశారని వారు పేర్కొంటున్నారు..

అయితే ప్రస్తుతం ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పక్కనెట్టి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ దిశగా అడుగులేయడంతో  బీజేపీ, టీడీపీ కూటమికి రాష్ట్రంలో ప్రతికూల వాతావరణం ఏర్ప‌డింద‌ని వైసీపీ భావిస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ద‌గా చేస్తున్న‌యన్న ప్ర‌చారాన్ని పెద్ద ఎత్తున చేప‌ట్ట‌డం ద్వారా. ప్ర‌జ‌ల్లో మ‌రింత‌ వ్య‌తిరేక‌త‌ను పెంచి.. దానిని తమ పార్టీకి అనుకూలంగా మల్చు కోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది.

2019 సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో విజ‌యమే ల‌క్ష్యంగా జ‌గ‌న్ ప్ర‌స్తుతం త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. త‌న బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు సొంతంగా అంచ‌నావేసుకుంటున్నారు. రెండు శాతం ఓట్ల తేడాతో గత సార్వత్రిక ఎన్ని కల్లో అధికారానికి దూరమైన త‌మ పార్టీ ఆ లోటును ఏయే వ‌ర్గాల ఓట్ల‌ను ఆక‌ర్షించ‌డం ద్వారా పూరించుకోవ‌చ్చ‌న్న‌ది జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. స‌హ‌జంగానే ఉపాధి కోసం ఎదురు చూసే.. యువతరం ఓట్లకు గాలం వేయ‌డం ద్వారా త‌మ ల‌క్ష్యం సాధించుకోవాల‌ని వైసీపీ అధినేత పావులు క‌దుపుతున్నారు. అందుకు అనుగుణంగా ప్రత్యేకహోదా అంశంపై విస్తృతంగా పోరాటం చేస్తూ… ఆ పోరాటంలో యువతను భాగ‌స్వాముల‌ను చేసేందుకు వైసీపీ ప్ర‌ణాళిక ర‌చించింది.

ఇప్ప‌టికే యువభేరీ స‌భ‌ ద్వారా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  ప్రత్యేకహోదా పోరు విషయంలో త‌న కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించింద‌నే చెప్పాలి. యువతను భాగస్వామ్యం చేసే దిశగా ఆ పార్టీ పావులుకదుపుతోంది. ప్ర‌త్యేక హోదాతో ఉపాధి అవ‌కాశాలు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా వ‌స్తాయ‌ని, అది రాకుంటే… యువ‌త భ‌విత అగ‌మ్య‌గోచ‌ర‌మేన‌న్న ప్ర‌చారాన్ని విస్తృతంగా యువ‌త‌లోకి తీసుకెళ్లేందుకు జ‌గ‌న్ పార్టీ సిద్ధ‌మ‌వుతోంది. జ‌గ‌న్ తాజా రాజ‌కీయం వ్యూహం చంద్ర‌బాబు రాజ‌కీయ చాణ‌క్యం ముందు ఎంత‌వ‌ర‌కూ ఫ‌లిస్తుందో వేచి చూడాల్సిందే..!