రెడ్డిగారు జోకేస్తే నవ్వరెందుకు!

తెలంగాణ టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి జోకేశారు. నవ్వొస్తే నవ్వండి. కానీ నవ్వడానికి అందులో అసలు మేటరుంటే కదా! తెలుగుదేశం పార్టీ తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని, టిడిపిని వీడి టిఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు కొందరు అభినందిస్తున్నారని రేవంత్‌రెడ్డి జోకేశారు మరి. 15 మంది ఎమ్మెల్యేలు 2014 ఎన్నికల్లో తెలంగాణ నుంచి టిడిపి తరఫున గెలిస్తే అందులోంచి 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేశారు. ఒకాయన టిడిపిలో ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు. ఇద్దరంటే ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే టిడిపికి మిగిలారు. అయినా అధికార పార్టీతో టిడిపి నడుపుతున్న పోరుని అభినందించాలి.

అయితే అలా అభినందించేవారు టిఆర్‌ఎస్‌లో చేరిన టిడిపి నేతలైతే ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి కెసియార్‌కి కోపమొస్తుంది. రేవంత్‌రెడ్డి, మాగంటి గోపి లాంటోళ్ళు అని చెప్పడంతో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీ పరిస్థితి ఇరకాటంలో పడిందట. పార్టీని వదిలి వెళ్ళిన వారు తిరిగి పార్టీలోకి రావాలని రేవంత్‌రెడ్డి కోరుకోవడం, ఆశ పడటం తప్పు కాకపోవచ్చు. పార్టీ ఫిరాయింపులే పెద్ద తప్పు. కానీ, ఆ తప్పుని ధైర్యంగా ప్రోత్సహిస్తున్నారు ముఖ్యమంత్రి కెసియార్‌. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల్ని వ్యతిరేకిస్తున్న టిడిపి, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సమర్థిస్తోంది. రేవంత్‌రెడ్డి మాటలే నిజమైతే, టిడిపిలో చేరిన వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు కూడా సొంత గూటి వైపు చూస్తున్నారనుకోవాలేమో.